
తెలంగాణలో మరో వారం రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే మూడు రోజులు మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది . సెప్టెంబర్ 15న అల్పపీడన ప్రాంతం బలహీన పడి ఉపరితల ఆవర్తనం గా మారిందని తెలిపింది. తెలంగాణకు ఆనుకొని తూర్పు విధర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైందని.. దీంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పింది
సెప్టెంబర్ 15న 21 జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, పెద్దపల్లి, జనగాం, హనుమకొండ, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
సెప్టెంబర్ 16న ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణ్ పేట్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని యెల్లో అలర్ట్స్ జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
గత నాలుగైదు రోజులుగా పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ లో భారీ వర్షం పడింది. సెప్టెంబర్ 14న రాత్రి హైదరాబాద్ ముషీరాబాద్ ,సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో 12 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది. రోడ్లు, కాలనీలను వరద ముంచెత్తింది. ముగ్గురు గల్లంతవ్వగా ఇప్పటి వరకు వాళ్ల ఆచూకీ కనిపించలేదు.