పేరుకే వాన.. ప్రాజెక్టులు నిండేనా?..జంట జలాశయాలు, ఎల్లంపల్లికే వరద

పేరుకే వాన..  ప్రాజెక్టులు నిండేనా?..జంట జలాశయాలు, ఎల్లంపల్లికే వరద
  • సింగూరు, సాగర్ లో అంతంతే.. 
  • సెప్టెంబర్​లో దంచి కొడితేనే తాగునీటి కష్టాలు దూరం 
  • లేకపోతే ప్రత్యామ్నాయం తప్పదు 

హైదరాబాద్​సిటీ, వెలుగు : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నా సిటీకి తాగునీటిని అందించే జంటజలాశయాలకు తప్ప.. ఇతర ప్రధాన ప్రాజెక్టులకు ఆశించిన స్థాయిలో వరద రావడం లేదు. అయితే, ప్రతి సంవత్సరం సెప్టెంబరులో కురిసే వర్షాలతోనే జలాశయాలు నిండుతాయని, ఈ నెలతో పాటు సెప్టెంబర్​లో పడే భారీ వర్షాలపైనే ఆశలు పెట్టుకున్నామని వాటర్​బోర్డు అధికారులు చెప్తున్నారు. లేకపోతే తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యల గురించి ఆలోచిస్తున్నామని అంటున్నారు. 

ఆందోళనకరంగానే సింగూరు 

గతంలో ఎన్నడూ లేని విధంగా సింగూరులో వాటర్​లెవెల్స్​ఆందోళనకరంగా ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి కెపాసిటీ 29.917 టీఎంసీలు కాగా, గత ఏడాది ఇదే టైంకు 20.663 టీఎంసీల నీళ్లున్నాయి. అయితే, ఏడాది కింద రిపేర్ల పేరుతో ఆరు టీఎంసీలకే పరిమితం చేశారు. ఎల్​నినో, వర్షాభావ పరిస్థితులతో ప్రస్తుతం 4.181 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు 0.153 టీఎంసీలు మాత్రమే నీళ్లు చేరాయి. ఈ నెలలో, సెప్టెంబర్​లో 2 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు చేరినా రిపేర్ల దృష్ట్యా స్టోరేజీ చేసుకోకుండా వదలాల్సిన పరిస్థితి నెలకొంది.  

సాగర్, మంజీరా ​అంతే...

 నాగార్జున సాగర్​లోకి కూడా పెద్దగా నీరు చేరకపోవడం సిటీకి సమస్యగా మారింది. నాగార్జున సాగర్ నుంచి సిటీ తాగునీటి అవసరాల కోసం ప్రతిరోజూ 270 ఎంజీడీల నీటిని తీసుకువస్తున్నారు.ఈ జలాశయం నీటి సామర్థ్యం 312.045 టీఎంసీలు కాగా,  గత ఏడాది ఇదే టైంకు ఈ ప్రాజెక్టులో 301 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. కానీ, ప్రస్తుతం 136.999 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు కేవలం 0.359 టీఎంసీల వరద మాత్రమే వచ్చి చేరింది. ఆశించిన వర్షాలు లేకపోతే డెడ్​స్టోరేజీకి (510 అడుగులు) చేరుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు పంపింగ్​తప్పని సరి..ఇక సిటీకి మరో తాగునీటి వనరు అయిన మంజీరాలోకి కూడా పెద్దగా వరద రావడం లేదు. 1.500 టీఎంసీల కెపాసిటీ ఉన్న ఈ ప్రాజెక్టులో ఇటీవల కురిసిన వర్షాలతో 0.548 టీఎంసీలకు చేరుకుంది. 

మిషన్​ భగీరథ’, గోదావరి నుంచి..

సింగూరు, మంజీరా ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆందోళనకరంగా ఉండడం, వర్షాలు కురవకపోతే సెప్టెంబర్​వరకే నీళ్లు సరిపోయే అవకాశం ఉండడంతో బోర్డు ప్రత్యామ్నాయ అంశాలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం సింగూరు నుంచి 70 ఎంజీడీలు, మంజీరా నుంచి 40 ఎంజీడీలు తెస్తుండగా నీటి నిల్వలు అడుగంటితే 110 ఎంజీడీల కొరత ఏర్పడుతుంది. ఈ లోటును మిషన్​భగీరథ (మల్లన్నసాగర్​), గోదావరి (ఎల్లంపల్లి)  నుంచి తీర్చుకోవాలని వాటర్​బోర్డు భావిస్తోంది. మిషన్ భగీరథ పనులు పూర్తయిన నేపథ్యంలో మల్లన్న సాగర్​ నుంచి 25 నుంచి 30 ఎంజీడీల వచ్చే అవకాశం ఉంటుందని బోర్డు చెప్తోంది. ఈ నీళ్లను తూర్పు హైదరాబాద్, మల్కాజిగిరి ప్రాంతాలకు వినియోగించేలా ప్లాన్​ చేశారు. అలాగే  గోదావరి నుంచి తెస్తున్న 165 ఎంజీడీలకు అదనంగా మరో10 ఎంజీడీలు, కృష్ణా నుంచి మరో 20 ఎంజీడీలు అదనంగా తెచ్చే ఆలోచన చేస్తున్నారు.  అయినా మరో 50 టీఎంసీల కొరత ఏర్పడుతుంది. అయితే, పూర్తిగా వర్షాలు లేకపోతేనే ఈ పరిస్థితి ఉంటుందని, అడపాదడపా వర్షాలు పడుతూ ఉంటే ఈ సమస్య ఉండదంటున్నారు.  

జంట జలాశయాలతో కాస్త ఊరట..

ఇక జంట జలాశయాలైన ఉస్మాన్​సాగర్, హిమాయత్​సాగర్, ఎల్లంపల్లి రిజర్వాయర్లలో మాత్రం పుష్కలంగా నీరు చేరుతోంది. హిమాయత్‌‌‌‌సాగర్ కు భారీగా వరద వస్తుండడంతో1763 అడుగులకు గాను 1761.500 అడుగుల నీళ్లున్నాయి. ఉస్మాన్‌‌‌‌సాగర్ (గండిపేట) ఫుల్​ట్యాంక్​ లెవెల్1790 అడుగులు కాగా ప్రస్తుతం 1783.850 అడుగుల నీళ్లున్నాయి. వర్షాలతో మంగళవారం నాటికి 0.041 టీఎంసీల నీళ్లు వచ్చి చేరాయి. ఎల్లంపల్లి (గోదావరి) రిజర్వాయర్​పూర్తి కెపాసిటీ 20.783 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.785 టీఎంసీలు ఉండడం సంతోషించదగ్గ పరిణామంగా చెప్పుకోవచ్చు.