
హైదరాబాద్లో మళ్లీ వర్షం మొదలైంది. మంగళవారం (సెప్టెంబర్ 2) ఉదయం నుంచి నగరంలో పొడి వాతావరణం ఉండగా.. మధ్యాహ్నానికి ఆకాశం మేఘావృతమే వర్షం షురూ అయ్యింది. సిటీలోని బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్ గచ్చిబౌలి, ఖైరతాబాద్, లక్డీకపూల్, ఎర్రమంజిల్, పంజాగుట్ట, అమీర్ పేట్, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షపు నీరు రోడ్లపై నిల్వడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఒక్కసారిగా వాహనాలు రోడ్లెక్కడంతో నగరంలో భారీగా ట్రాఫిక్ నెలకొంది. కొన్ని చోట్ల కిలో మీటర్ల మేరకు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఒకవైపు వర్షం.. మరోవైపు వినాయక నిమిజ్జనాలతో సిటీలోనిప్రధాన రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు.
►ALSO READ | Kavitha: ఇప్పుడు కవిత ఏం చేయబోతున్నారు..? ఈ 5 పాయింట్ల పైనే అందరిలో ఉత్కంఠ
నగరంలో వర్షం మళ్లీ షురూ కావడంతో జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీసులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాల రద్దీని క్లియర్ చేస్తున్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. నగరానికి భారీ వర్ష సూచన ఉండటంతో సిటీ ప్రజలకు, జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు కీలక సూచన చేశారు. అవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలని సూచించారు.