
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో.. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి 2025, సెప్టెంబర్ 2వ తేదీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే.. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. కవిత ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నందున పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేయాలని పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నిర్ణయించుకున్నారని బీఆర్ఎస్ ఒక నోట్ విడుదల చేసింది. కొన్నాళ్ల నుంచి కవిత చేస్తున్న వ్యాఖ్యలు.. ఆమె అనుసరిస్తున్న వైఖరిని గమనిస్తే.. ఏదో ఒక రోజు ఇలాంటి నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలంగాణ రాజకీయ వర్గాలు భావించాయి.
అయితే.. కవిత నెక్స్ట్ ఏం చేస్తారనే విషయంలో మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ పార్టీతో కవిత పూర్తిగా తెగతెంపులు చేసుకుని కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని జోరుగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో.. సన్నిహితులతో ఎమ్మెల్సీ కవిత సమాలోచనలు ఉత్కంఠ రేపుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి కల్వకుంట్ల కవిత ఒకేసారి రాజీనామా చేయొచ్చనే అభిప్రాయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఎమ్మెల్సీ పదవిపై శాసనమండలికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేయకముందే పదవి వదులుకోవాలని కవిత భావిస్తున్నట్లు సమాచారం. కవిత ఏం చేస్తారనే విషయం అటుంచితే.. తెలంగాణ జాగృతి ఆఫీస్‌కు కవిత మద్దతుదారులు భారీగా చేరుకుని ఆమెకు సంఘీభావం ప్రకటించారు. ‘జై కవితక్క.. జై జాగృతి’ అంటూ నినాదాలు చేశారు. కవిత తీవ్ర ఆరోపణలు చేసిన హరీష్ రావు, జగదీష్‌రెడ్డికి వ్యతిరేకంగా కవిత మద్దతుదారులు నినాదాలు చేశారు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఏం చేయబోతున్నారనే అంశాన్ని తెలంగాణ రాజకీయ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి.
ఇప్పుడు కవిత ఏం చేయబోతున్నారు..? ఈ 5 పాయింట్ల పైనే అందరిలో ఉత్కంఠ
1. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతారా లేక రాజీనామా చేస్తారా..?
2. జాగృతి ద్వారానే కార్యక్రమాలు కొనసాగిస్తారా లేక కొత్తగా పార్టీ ఏమైనా పెడతారా..? (లేదా) అనూహ్యంగా ఏదైనా పార్టీలో చేరతారా..?
3. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితతో నడిచేది ఎవరు..?
4. ఒక వేళ రాజకీయ పార్టీ పెడితే కవిత జెండా ఏంటి.. ఎజెండా అంశాలు ఏంటి..?
5. పుట్టింటి పార్టీ సస్పెండ్ చేసింది సరే.. మెట్టినింట రాజకీయంగా రాణించే వ్యూహం, సత్తా కవితకు ఉన్నాయా..?