నేరాల నియంత్రణలో ముందున్నాం : డీజీపీ శివధర్ రెడ్డి

నేరాల నియంత్రణలో ముందున్నాం : డీజీపీ శివధర్ రెడ్డి
  • పోలీస్​ ఆఫీసర్ల మీటింగ్​లో డీజీపీ శివధర్ రెడ్డి

ఖమ్మం టౌన్, వెలుగు: నేరాల నియంత్రణలో తెలంగాణ పోలీసులు ముందున్నారని డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఆయనకు మల్టీ జోన్  ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి, సీపీ సునీల్ దత్  స్వాగతం పలికారు. పోలీస్  హెడ్ క్వార్టర్స్ లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్  పోలీస్  స్పోర్ట్స్  కాంప్లెక్స్, పోలీస్  భవనాలను ప్రారంభించి పరిశీలించారు. అనంతరం పోలీస్  శిక్షణ కేంద్రంలో అధికారులతో క్రైం రివ్యూ మీటింగ్​ నిర్వహించారు.

జిల్లాలో జరిగిన నేరాలు, ముఖ్య కేసుల దర్యాప్తు, శాంతి భద్రతలు, మహిళలు, శిశువుల భద్రత, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, మాదకద్రవ్యాల నియంత్రణ, ఇసుక అక్రమ రవాణా  నియంత్రణకు చేపడుతున్న చర్యలపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ రాష్ట్ర పోలీసులకు దేశంలోనే మంచి పేరుందని, ఇతర రాష్ట్రాలతో పోల్చితే నేరాల నియంత్రణలో, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలోనూ ముందువరుసలో ఉన్నామని తెలిపారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ సైబర్  సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ), ఈగల్  దేశంలోనే అత్యున్నతంగా పని చేస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్  కమిషనరేట్ లో రూపొందించిన  ‘సైబర్  సింబా’ కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేసి సైబర్  నేరాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.

రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు ‘అరైవ్  అలైవ్’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు ‘ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో అరైవ్  అలైవ్​ను అన్ని శాఖల సమన్వయంతో ప్రచారం చేయాలని నిర్ణయించిందని చెప్పారు. మాదకద్రవ్యాల రవాణాను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. గంజాయి, మాదకద్రవ్యాలను కట్టడి చేసేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. 

ఫిల్లింగ్  స్టేషన్ ను ప్రారంభించిన డీజీపీ

వరంగల్​ సిటీ: వరంగల్  పోలీస్  కమిషనరేట్  పరిధిలోని మడికొండ పోలీస్  శిక్షణ కేంద్రం ఆవరణలో కొత్తగా ఏర్పాటు చేసిన ఇండియన్  ఆయిల్  పెట్రోల్  ఫిల్లింగ్  స్టేషన్​ను డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. పోలీస్​ సిబ్బంది సంక్షేమం, వాహనాల నిర్వహణలో సౌలభ్యమే లక్ష్యంగా పెట్రోల్  బంక్​ను ఏర్పాటు చేసినట్లు  తెలిపారు. వరంగల్  పోలీస్  కమిషనర్  సన్ ప్రీత్ సింగ్, సెంట్రల్  జోన్  డీసీపీలు కవిత, అంకిత్ కుమార్, ఏఎస్పీ శుభం పాల్గొన్నారు.

ఇబ్బందులు చెప్పుకునేందుకు భరోసా సెంటర్లు

జనగామ: మహిళలు, చిన్నారులు తాము ఎదుర్కుంటున్న ఇబ్బందులు చెప్పుకోవడానికే భరోసా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ శివధర్​ రెడ్డి తెలిపారు. జనగామలో భరోసా సెంటర్​ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. మహిళలు, చిన్నారులు అన్ని విషయాలు పోలీసులతో చెప్పుకోలేక పోవచ్చనే ఉద్దేశంతో సైకాలజిస్టులు, మెడికల్  సపోర్టర్స్,​ లీగల్​ అడ్వైజర్లతో భరోసా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

కేసు నమోదు నుంచి చార్జిషీట్‌‌  దాఖలు చేసేంత వరకు పోలీసులు బాధ్యత తీసుకుంటారని తెలిపారు. బాధితులకు సైకాలజిస్టు, అడ్వైజర్లు, లాయర్లతో కూడిన భరోసా సెంటర్‌‌  అండగా ఉంటుందని చెప్పారు. అనంతరం క్రైం​రివ్యూ మీటింగ్​లో పాల్గొన్నారు. కలెక్టర్​ సంజ్​ కుమార్​ ఝా, సీపీ సన్​ప్రీత్​సింగ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, అంకిత్‌‌ కుమార్, కవిత ఉన్నారు.