- ఏపీ, తెలంగాణ ముఖ్య నేతలతోనూ సమావేశం
- యూత్ కాంగ్రెస్ నేత నరసింహ యాదవ్ కుటుంబానికి పరామర్శ
- లొంగిపోయిన మాజీ మావోయిస్టులతో భేటీ అయ్యే చాన్స్!
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పది రోజులుగా అనంతగిరిలోని హరిత రిసార్ట్‌లో కొనసాగుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా డీసీసీ చీఫ్‌లకు, పార్టీ ముఖ్య నేతలకు రాహుల్ గాంధీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు.
రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం , పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. రాహుల్ గాంధీ సోమవారం ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ రాహుల్‌గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలకనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా ఇద్దరు కలిసి వికారాబాద్ జిల్లాకు బయలుదేరి వెళ్తారు. వికారాబాద్‌లో హెలిప్యాడ్ వద్ద తెలంగాణ, ఏపీ కాంగ్రెస్ ముఖ్యనేతలు ఆయనకు స్వాగతం పలకనున్నారు. అక్కడే కొద్దిసేపు నేతలతో ముచ్చటించిన అనంతరం రోడ్డు మార్గంలో అనంతగిరిలోని హరిత రిసార్ట్‌కు చేరుకుంటారు.
డీసీసీలకు దిశానిర్దేశం
డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. సంస్థాగత బలోపేతం, రాబోయే ఎన్నికలు వంటి కీలక అంశాలపై డీసీసీ అధ్యక్షులకు ఆయన దిశా నిర్దేశం చేయనున్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంపై సూచనలు చేయనున్నారు. అనంతరం జడ్చర్లకు చెందిన యూత్ కాంగ్రెస్ నేత నరసింహ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించే చాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఏఐ సమిట్‌ను వ్యతిరేకిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేయగా.. అందులో పాల్గొన్న నరసింహ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. పార్టీ కోసం పోరాడి జైలుకెళ్లిన నరసింహ యాదవ్ కుటుంబ సభ్యులను కలిసి పర్యామర్శించనున్నారు. మరోవైపు ఇటీవల లొంగిపోయిన మాజీ మావోయిస్టులతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యే చాన్స్ ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. వారి జీవన స్థితిగతులు, పునరావాసం వంటి అంశాలపై రాహుల్ ఆరా తీసే చాన్స్ ఉన్నట్లు సమాచారం. పర్యటన ముగిసిన తర్వాత రాహుల్ తిరిగి ఢిల్లీకి పయనమవుతారు.
