- ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు.. హనుమకొండలో మరో ఇద్దరు
ఇంద్రవెల్లి, వెలుగు : బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు చనిపోయారు. ఈ ప్రమాదం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని దన్నోరా (బి) గ్రామ సమీపంలో ఆదివారం జరిగింది. ఉట్నూర్ సీఐ మడవి ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమ్రంభీం కాలనీకి చెందిన ఆడ విజయ్ (22), ఉట్నూర్ మండలంలోని సాలెవాడ గ్రామానికి చెందిన నైతం జంగుబాయి (62)తో కలిసి బైక్‌పై ఆదిలాబాద్ నుంచి ఇంద్రవెల్లి వెళ్తున్నారు. దన్నోరా(బి) గ్రామం వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ మడవి ప్రసాద్ తెలిపారు.
హనుమకొండ జిల్లాలో...
కమలాపూర్ (ఎల్కతుర్తి), వెలుగు: బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు చనిపోయారు. ఈ ప్రమాదం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం లక్ష్మీపూర్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. శనిగరం గ్రామానికి చెందిన బండ వినయ్‌కుమార్ (27), వట్టెంల నాగరాజు (23) బైక్‌పై కమలాపూర్ వెళ్తున్నారు. లక్ష్మీపూర్ వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు.
