- రెండు నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్
- మన్నా ట్రస్ట్, అక్షయ పాత్రకు నిర్వహణ బాధ్యతలు
- ప్రీ-ప్రైమరీ నుంచి టెన్త్ వరకు 20 లక్షల మందికి లబ్ధి
వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి స్కూళ్లు రీ ఓపెన్ అయ్యే తొలిరోజే బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను అమలు చేసేలా సర్కారు కసరత్తు చేస్తున్నది. ప్రీ -ప్రైమరీ నుంచి పదో తరగతి వరకు చదువుతున్న సుమారు 20 లక్షల మంది స్టూడెంట్లకు ఉదయం పూట పోషకాహారం అందించనున్నారు.
హైదరాబాద్, వెలుగు : వచ్చే అకడమిక్ఇయర్నుంచి స్కూళ్లు రీ ఓపెన్ అయ్యే తొలిరోజే బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ను అమలు చేసేలా సర్కారు కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి కాకుండా అక్కడ ఉన్న వసతులు, సెంట్రలైజ్డ్ కిచెన్ల లభ్యతను బట్టి దశలవారీగా ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది.
ప్రీ -ప్రైమరీ నుంచి పదో తరగతి వరకు చదువుతున్న సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు ఉదయం పూట పోషకాహారం అందించాలనే లక్ష్యంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిరోజూ విద్యార్థులకు పాలు కూడా అందించాలని తాజాగా జరిగిన విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
సెంట్రలైజ్డ్ కిచెన్లతో పంపిణీ..
ప్రభుత్వ స్కూళ్లలో వంట చేయడానికి ఇబ్బందులు లేకుండా, నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ‘సెంట్రలైజ్డ్ కిచెన్’ విధానాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. దీని ప్రకారం ప్రతి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి ఒక సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అక్కడి నుంచే ఆయా నియోజకవర్గాల్లోని సర్కారు స్కూళ్లకు టిఫిన్ సప్లయ్ అవుతుంది. ఈ బాధ్యతను స్వచ్ఛంద సంస్థలైన మన్నా ట్రస్ట్, అక్షయ పాత్రకు అప్పగించాలని నిర్ణయించారు.
హైదరాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మేడ్చల్, వరంగల్ తదితర జిల్లాల్లో మన్నా ట్రస్టుకు ఇవ్వాలని, మిగిలిన చోట అక్షయ పాత్రకు ఇవ్వాలని భావిస్తున్నారు. నియోజకవర్గాల్లో ఒకటిన్నర ఎకరం నుంచి రెండు ఎకరాల స్థలాలను వీరికి లీజ్ రూపంలో కేటాయించాలని నిర్ణయించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో అధికారులు చర్చించారు. సీఎస్ రామకృష్ణారావు స్థలాలను సేకరించాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఇప్పటికే సీఎం నియోజకవర్గం కొడంగల్ లోని అన్ని బడుల్లో బ్రేక్ ఫాస్ట్ కొనసాగుతోంది.
దశలవారీగా విస్తరణ..
ముందుగా వసతులు ఉన్న ప్రాంతాలు, సెంట్రలైజ్డ్ కిచెన్లు సిద్ధంగా ఉన్న నియోజకవర్గాల్లో స్కూల్ రీ ఓపెన్ అయిన ఫస్ట్ డే నుంచే బ్రేక్ ఫాస్ట్ పెట్టనున్నారు. మిగిలిన ప్రాంతాల్లో కిచెన్ల నిర్మాణం పూర్తయ్యే కొద్దీ స్కీమ్‌ను విస్తరించే యోచనలో ఉన్నారు. ఈ పథకం ద్వారా సర్కారు బడుల్లోని పేద విద్యార్థులకు ఉదయం కడుపు నిండా టిఫిన్ దొరుకుతుంది. బడి మానేసే వారి సంఖ్య కూడా తగ్గుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఒక్కో విద్యార్థికి రూ.10.50 ఇస్తుండగా, దాన్ని ప్రైమరీ స్కూల్ స్టూడెంట్లకు రూ.11, హైస్కూల్ విద్యార్థులకు రూ.13కు పెంచే యోచనలో ఉన్నారు. ప్రతి స్టూడెంట్ కి మిల్లెట్ ఇడ్లీ, దోశ, చపాతి, టమాట రైస్, కిచిడీతో టిఫిన్ పెట్టనున్నారు. అయితే, ఎన్నికల టైమ్‌లో హడావుడిగా మార్గదర్శకాలు లేకుండా గత బీఆర్ఎస్ సర్కారు 5 వేల బడుల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఆ బకాయిలు రూ.13 కోట్లు పెండింగ్ లోనే ఉన్నాయి. వీటిని త్వరగా రిలీజ్ చేయాలని హెడ్మాస్టర్లు కోరుతున్నారు.
