న్యూఢిల్లీ: గ్రాస్ జీఎస్‌టీ వసూళ్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.1.83 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కిందటేడాది ఫిబ్రవరితో పోలిస్తే 8.1 శాతం వృద్ధి కనిపించింది. ఇందులో దేశీయ ట్రాన్సాక్షన్ల నుంచి రూ.1.36 లక్షల కోట్లు, దిగుమతుల నుంచి రూ.47,837 కోట్లు వచ్చాయి. రిఫండ్‌లు కూడా 10.2శాతం పెరిగి రూ.22,595 కోట్లకు చేరాయి. నికర జీఎస్‌టీ వసూళ్లు ఫిబ్రవరిలో రూ.1.61 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇది ఏడాది ప్రాతిపదికన 7.9శాతం ఎక్కువ. అయితే నికర సెస్ ఆదాయం రూ.5,063 కోట్లకు తగ్గింది. ఇది గతేడాది ఫిబ్రవరిలో రూ.13,481 కోట్లుగా ఉంది.
సెప్టెంబర్ 2025లో జీఎస్‌టీ రేట్లు తగ్గించడంతో ప్రారంభంలో ఆదాయం తగ్గినా, నవంబరులో రూ.1.70 లక్షల కోట్లు, డిసెంబరులో రూ.1.74 లక్షల కోట్లు, జనవరిలో రూ.1.93 లక్షల కోట్లు, ఫిబ్రవరిలో రూ.1.83 లక్షల కోట్లు వసూలయ్యాయి. వినియోగం పెరగడం వల్ల జీఎస్‌టీ రేట్లు తగ్గినా ఆదాయం నిలకడగా ఉందని డెలాయిట్ ఇండియా భాగస్వామి ఎంఎస్ మణి అన్నారు. అయితే తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో జీఎస్‌టీ వసూళ్లు తగ్గగా, వెస్ట్ బెంగాల్, హర్యానా, యూపీ , మహారాష్ట్రలో వృద్ధి కనిపించింది.
