- సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి
హైదరాబాద్, వెలుగు: రాబోయే వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు కలగొద్దని, ఆ దిశగా ముందస్తు చర్యలు తీసుకోవాలని సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్జ్యోతి జీఎంలను ఆదేశించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు డిమాండ్ మేర బొగ్గును సరఫరా చేయాలన్న ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఆయన శనివారం సమీక్ష నిర్వహించారు. మరో పది రోజుల్లో నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనాలతో సత్వరమే ఏర్పాట్లు చేయాలని సూచించారు.
గనుల్లోకి వచ్చే నీటిని తోడటానికి 100కు పైగా భారీ మోటార్లను ఏర్పాటు చేసినట్లు జీఎంలు వివరించారు. సింగరేణి బొగ్గులో 95% ఓపెన్ కాస్ట్ గనుల నుంచే వస్తోందని, వర్షాలకు నీరు నిలిచి ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందని సీఎండీ అన్నారు. నీరు నిల్వ లేకుండా కంపెనీ పంపులతో పాటు ప్రైవేటు పంపులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గత రెండేళ్లుగా వర్షాల వల్ల తీవ్రంగా బొగ్గు ఉత్పత్తిని కోల్పోయిన ఉపరితల గనులపై ఈ ఏడాది మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కొన్ని గనులు లక్ష్యాలు సాధించలేకపోవడానికి గల కారణాలపై చర్చించారు. భారీ యంత్రాలతో పూర్తి పనిగంటలు, మానవ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించాలని ఆదేశించారు. కంపెనీ సవాళ్లను కార్మికులకు వివరిస్తూ ప్రతి ఉద్యోగి సంస్థ అభివృద్ధికి పాటుపడేలా చైతన్యపరచాలన్నారు. డైరెక్టర్లు ఎల్. వి సూర్య నారాయణ, కె. వెంకటేశ్వర్లు, గౌతమ్ పోట్రు, ఎం. తిరుమల రావు, ఈడీ బి. వెంకన్న, జీఎం టి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
