సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు చేపట్టాలి.. గ్రామాల్లో శానిటేషన్ పక్కాగా అమలు చేయాలి

సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు చేపట్టాలి.. గ్రామాల్లో శానిటేషన్ పక్కాగా అమలు చేయాలి
  •     మెదక్​ కలెక్టర్​ ప్రతిమాసింగ్​

మెదక్​ టౌన్​, వెలుగు :   మెదక్ జిల్లాలో వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని, గ్రామాల్లో శానిటేషన్ పక్కాగా అమలు చేస్తూ హైరిస్క్ ప్రాంతాల్లో ముందస్తుగా వైద్య శిబిరాలు, ఫీవర్ సర్వే నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన వైద్యారోగ్య, పంచాయతీ అధికారుల సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు.  

వాతావరణ మార్పుల నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్లో డెంగ్యూ భయాలను దూరం చేస్తూ అవగాహన కల్పించాలని సూచించారు. ఈనెల 13న జరిగే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని, ప్రైవేట్ డీలర్లు, మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3,617 మెట్రిక్ టన్నుల స్టాక్ అందుబాటులో ఉందని, రైతులు భారీ లైన్లలో నిలబడకుండా యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని సూచించారు. అనంతరం జొన్నల కొనుగోలుపై కలెక్టర్​ మీడియాతో మాట్లాడారు. 

జిల్లాలో రికార్డు స్థాయిలో 1,01,752 మంది రైతుల నుంచి 4,28,361 లక్షల మెట్రిక్ టన్నుల యాసంగి ధాన్యాన్ని సేకరించి, వారి ఖాతాల్లో రూ.1005.66 కోట్లు జమ చేసి రాష్ట్రంలోనే 8వ స్థానంలో నిలిచామని తెలిపారు. జొన్న రైతులు వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని, ఇప్పటికే 6,347 మెట్రిక్ టన్నుల జొన్నలను కొనుగోలు చేశామని చెప్పారు. అన్నదాతలు కేవలం వరిపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పప్పుధాన్యాల పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. సర్ కార్యక్రమాన్ని సక్సెస్​ చేయాలని కోరారు.