రైతుబంధు.. ఈసారి దుబ్బాకకే ముందు..

V6 Velugu Posted on Oct 28, 2020

పోలింగ్​కు ముందు రైతుల అకౌంట్లలో డబ్బు వేసేలా సర్కారు వ్యూహం

ప్రగతి భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అమలు

హుజూర్​నగర్​ బై పోల్​లో ‘రైతుబంధు’ కలిసొచ్చిందంటున్న నేతలు

హైదరాబాద్, వెలుగు: దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్‌ రైతులకు ఈసారి అందరికన్నా ముందు రైతుబంధు డబ్బులు వేసేలా సర్కారు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. నవంబర్‌ 3న జరిగే పోలింగ్‌కు ఒకటి, రెండు రోజుల ముందు రైతుల అకౌంట్లలోకి నగదు పడేలా ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. ప్రగతిభవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే దుబ్బాక రైతులకు పథకం అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దుబ్బాక జనానికి ఆసరా పెన్షన్లూ ముందే ఇవ్వాలని సర్కారు ఆలోచిస్తున్నట్టు సమాచారం. సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే ఆరా తీసినట్టు తెలిసింది.

రైతుల కోపం చల్లార్చేందుకేనా?

ఈ మధ్య కురిసిన వానలకు వరి, పత్తి, పెసర, కంది పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరోవైపు మక్కలను కొనేందుకు సర్కారు ముందుకు రాలేదు. మార్కెట్ లో ధర లేదని, కొనలేమని చేతులెత్తేసింది. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో దిగొచ్చింది. ఈ విషయంలో దుబ్బాక రైతులూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని టీఆర్ఎస్ లీడర్లు ఆందోళన చెందుతున్నారు. వాళ్ల కోపం చల్లార్చేందుకు రైతుబంధు సాయం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు పార్టీ లీడర్లు చెబుతున్నారు. పోలింగ్ కు ముందు పథకం సొమ్ము అందిస్తే రైతులు టీఆర్‌‌ఎస్‌‌కు అనుకూలంగా ఓటేస్తారని లీడర్లు అనుకుంటున్నారు.

సెగ్మెంట్​లో 60 వేల మంది రైతులు

దుబ్బాక సెగ్మెంట్ లో 1.82 లక్షల మంది ఓటర్లు ఉండగా వీళ్లలో 60 వేల మంది రైతులున్నారు. ఈ రైతుల్లో రెండు, మూడు ఎకరాల్లోపు వాళ్లే ఎక్కువున్నారు. వీళ్లందరికీ రైతుబంధు ఇవ్వడానికి (ఎకరాకు రూ.5 వేలు) సుమారు రూ. 300 కోట్లు అవసరమవుతుందని అధికారులు లెక్కలేసినట్టు తెలిసింది. రాష్ట్రమంతా డబ్బులేయాలంటే రూ. 7,220 కోట్లు కావాలని, ప్రస్తుతం సర్కారు దగ్గర డబ్బుల కొరత ఉందని అధికారుల్లో చర్చ నడుస్తోంది. కాబట్టి ముందు దుబ్బాకకు, విమర్శలు రాకుండా ఇంకొన్ని ప్రాంతాలకు నగదు బదిలీ చేయాలని సర్కారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల టైమ్‌‌లోనూ అధికార పార్టీకి రైతుబంధు మేలు చేసిందని ప్రచారం ఉంది. కొన్నిచోట్ల ఓటర్లు క్యూలో ఉన్నప్పుడే వాళ్ల అకౌంట్ లోకి డబ్బులు పడినట్టు మెసేజ్ వచ్చిన సందర్భాలున్నాయని టాక్ ఉంది.

హుజూర్ నగర్‌‌లో కలిసొచ్చిన రైతుబంధు

గతేడాది అక్టోబర్‌‌లో హుజూర్‌‌నగర్ ఉప ఎన్నిక జరిగింది. పోలింగ్‌‌కు ముందు హుజూర్ నగర్ రైతులతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు రైతుబంధు సాయం అందించారు. వానకాలం సీజన్ బకాయిలను నిధుల కొరత కారణంగా వాయిదా వేసి ఎన్నికల ప్రచారం మొదలైన వెంటనే విడుదల చేశారు. ఓ వైపు ప్రచారం జరుగుతోంటే మరోవైపు రైతుల అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. రైతుల ఓటింగ్ శాతం పెరిగి టీఆర్ఎస్ క్యాండిడేట్‌‌ గెలిచారని ఇప్పటికి టీఆర్ఎస్ లీడర్లు చెబుతుంటారు.

ఆసరా పెన్షన్లూ ఎర్లీగానే..

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల 10వ తేదీ నాటికి ఆసరా పెన్షన్లను లబ్ధిదారులకు అందిస్తారు. దుబ్బాక సెగ్మెంట్‌లో ఆసరా లబ్ధిదారులు దాదాపు 20 వేల మంది ఉన్నారు.  బై ఎలక్షన్‌ దృష్ట్యా దుబ్బాకలో ఈ పెన్షన్లను ముందే అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. వీరందరికీ పోలింగ్‌కు ముందు పెన్షన్లు  అందించే చాన్స్ ఉందా అని రూరల్ డెవలప్ మెంట్ అధికారులను ప్రగతిభవన్ వర్గాలు ఆరా తీసినట్టు తెలిసింది.

Tagged scheme, time, updates, dubbaka, Today, details, bypoll, war, in, to, this, constituency, advance, raithu bandhu

Latest Videos

Subscribe Now

More News