- కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ వల్లే బీజేపీ నాశనం: రాజాసింగ్
- గెలవాలని కాంగ్రెస్.. ఓడిపోవాలని బీజేపీ పనిచేసింది
- ఇట్లయితే 50 ఏండ్లయినా అధికారంలోకి రాలేం
- మొండి పట్టుకు పోయి పార్టీని నాశనం చెయ్యొద్దని విజ్క్షప్తి
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ఘోర పరాజయంపై ఆ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకత్వం తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ నేతలు గెలుపు కోసం కాకుండా.. ఓడిపోవడం కోసమే పనిచేశారని సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, లక్ష్మణ్ టార్గెట్ గా రాజాసింగ్ విరుచుకుపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల అనంతరం ఆయన మీడియాకు ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం.
అలాంటి చోట కాంగ్రెస్ పార్టీ పక్కా ప్లాన్ తో పనిచేసి గెలిచింది. గెలవాలనే కసితో కాంగ్రెస్ పనిచేసింది. కానీ, మన బీజేపీ నేతలు మాత్రం ఎన్ని ఓట్లతో ఓడిపోవాలని టార్గెట్ పెట్టుకుని పనిచేశారు’’ అని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ లో ఓటమి ఖాయమని తనకు ముందే తెలుసని, ఈ విషయాన్ని కిషన్ రెడ్డికి కూడా ముందే చెప్పానని గుర్తుచేశారు. జూబ్లీహిల్స్ ఓటమికి ఎవరు బాధ్యత తీసుకుంటారని రాజాసింగ్ ప్రశ్నించారు. ‘‘రాబోయే జీహెచ్ఎంసీ, లోకల్ బాడీ ఎన్నికల పరిస్థితి ఏంటి? అక్కడ కూడా ఇలాంటి ఫలితాలే వస్తే పార్టీ కార్యకర్తలు, నేతలు ఎక్కడికి పోవాలి?’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకుల మొండి వైఖరి మారకపోతే మరో 50 ఏండ్లయినా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం కష్టమని రాజాసింగ్ అన్నారు.
తాను కిషన్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం లేదని, సొంత పార్టీ నాశనం అవుతుందన్న బాధతోనే ఈ మాటలు అంటున్నానని రాజాసింగ్ స్పష్టం చేశారు. ‘నేను పార్టీలోకి తిరిగి రాను. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో కూడా తెలియదు. కానీ, ఇది నా పార్టీ. కళ్ల ముందే పార్టీని ముంచేస్తుంటే చూస్తూ ఊరుకోలేను. ఇప్పటికైనా పెద్దలు తమ పంతాలు వీడి... పార్టీని కాపాడాలి’ అని ఆయన కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ కు విజ్ఞప్తి చేశారు. అలాగే, జూబ్లీహిల్స్ లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కు రాజాసింగ్ శుభాకాంక్షలు తెలిపారు.
