- బండి సంజయ్‌కు మద్దతుగా ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు
అబిడ్స్, వెలుగు: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ వ్యవహారంపై విచారణ పూర్తికాకముందే రాజకీయ విమర్శలు చేయడం తగదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఈ ఘటనపై వాస్తవాలు తేల్చేందుకు సిట్ విచారణ ప్రారంభం కాకముందే బీఆర్ఎస్ నేతలు బీజేపీని, బండి సంజయ్‌ను టార్గెట్ చేయడం రాజకీయ దురుద్దేశమేనని విమర్శించారు. ఒకవేళ తన కుమారుడు తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం శిక్షించవచ్చని స్వయంగా బండి సంజయ్ చెప్పారని, విచారణకు బీజేపీ ఎప్పుడూ అడ్డుపడదని రాజాసింగ్ స్పష్టం చేశారు.
గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు, జూబ్లీహిల్స్ ఘటనలో ఎంఐఎం నేత కుమారుడిపై ఆరోపణలు వచ్చినప్పుడు స్పందించని వారు.. ఇప్పుడు రాజీనామాలు డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మీడియా కథనాల ఆధారంగా ఒక నాయకుడిని రాజకీయంగా దెబ్బతీయాలని చూడటం సరికాదని, విచారణ కొనసాగుతున్నందున ఎవరూ బండి సంజయ్‌పై తప్పుగా మాట్లాడకూడదని ఆయన సూచించారు. ఒకవేళ తప్పు జరిగినట్లు తేలితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని రాజాసింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పంజాగుట్ట: కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను రాజకీయంగా దెబ్బతీయడానికే తప్పుడు ప్రచారాలతో కుట్రలు పన్నుతున్నారని మున్నూరు కాపు సంఘాల సమాఖ్య సభ్యులు ఆలపాటి లక్ష్మీనారాయణ ఆరోపించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. నాలుగు నెలల క్రితం స్నేహితుల మధ్య జరిగిన చిన్న సంఘటనను, ప్రధాని పర్యటన సమయంలో కావాలనే తెరపైకి తేవడం వెనుక దురుద్దేశం ఉందని విమర్శించారు.
