
సినీ నటుడు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది. రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని.. వెంటిలేటర్ అవసరం లేకుండానే చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపాయి. వైద్య బృందం రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి.
అయితే నాన్న కరోనాతో పోరాడుతున్నారు, మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ రాజశేఖర్ కుమార్తె శివాత్మిక చేసిన ట్వీట్ అటు సినీ రంగంలోనూ, ఇటు అభిమానవర్గంలోనూ కలకలం రేపింది. ఆ తర్వాత వెంటనే నాన్న బాగానే ఉన్నారంటూ మరో ట్వీట్ చేసింది. ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని…కరోనా నుంచి కోలుకుంటున్నారని రెండో ట్వీట్ లో తెలిపింది.
రాజశేఖర్ కుటుంబం ఇటీవలే కరోనా బారిన పడింది. రాజశేఖర్, ఆయన భార్య జీవిత, వాళ్ల కుమార్తెలు శివానీ, శివాత్మిక కరోనా బారినపడ్డారు. అయితే వారి కుమార్తెలు శివాత్మిక, శివానీ వెంటనే కోలుకోగా.. రాజశేఖర్, జీవితలకు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం జీవితకు కూడా కరోనా నెగిటివ్ గా వచ్చినట్లు తెలుస్తోంది.