కేసీఆర్‌కు డప్పు బ్యాచ్‌, అరిచే బ్యాచ్‌లు ఉన్నాయ్‌

కేసీఆర్‌కు డప్పు బ్యాచ్‌, అరిచే బ్యాచ్‌లు ఉన్నాయ్‌

అసెంబ్లీలోనూ అబద్ధాలేనా
కేసీఆర్‌కు డప్పు బ్యాచ్‌, అరిచే బ్యాచ్‌లు ఉన్నాయ్‌: ఎమ్మెల్యే రాజాసింగ్
ఎన్పీఆర్ అంటే ఆయనకు ఎందుకంత భయం

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడకుండా అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ రెండు టీంలను ఏర్పాటు చేసుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఇందులో ఒకటి అరిచే టీం అని, అది ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేటప్పుడు అడ్డు తగులుతుందన్నారు. ఇంకొకటి సీఎం కేసీఆర్ ఏం మాట్లాడినా డప్పు కొడుతుందని విమర్శించారు. కేసీఆర్ బయట ఎలాగో అబద్ధాలు మాట్లాడుతారని, అది అందరికీ తెలిసిందేనని, కానీ అసెంబ్లీ సాక్షిగా కూడా ఆయన​అబద్ధాలే మాట్లాడుతారని రాజాసింగ్​ మండిపడ్డారు. నిలకడ లేని వ్యక్తి కేసీఆర్ అని, రాత్రికో మాట, పొద్దునో మాట మాట్లాడడం ఆయనకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేని సీఎం కేసీఆర్​ ‘కరోనా’ పేరుతో సభను వాయిదా వేసి పారిపోయారని రాజాసింగ్ ధ్వజమెత్తారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం మాట్లాడే మాటలు అభ్యంతరకరంగా ఉంటాయని, తాము అలా మాట్లాడడం రాక కాదని, కానీ తమకు పెద్దలు చెప్పినట్లు పద్ధతిగా మాట్లాడడం అలవాటైందని చెప్పారు. కేంద్రం సపోర్టు లేకుండా రాష్ట్రంలో ఏ అభివృద్ధి సాగడం లేదన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో పక్క రాష్ట్రాన్ని చూసైనా ఈ సీఎం నేర్చుకోవాలని సూచించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాజాసింగ్​ మీడియాతో మాట్లాడారు. ఈ ఐదేండ్లలో రాష్ట్రంలో కేసీఆర్ సాధించిన ప్రగతి ఏమిటని ప్రశ్నించారు.

మద్యం తెలంగాణగా మార్చారు

బంగారు తెలంగాణ అని  చెప్పి మద్యం, అప్పుల తెలంగాణగా మార్చారని రాజాసింగ్​ దుయ్యబట్టారు. ఏటా 19 వేల కోట్లు వడ్డీలే కడుతున్నారని తెలిపారు. భైంసాలో ఇండ్లు తగలబడిపోయిన బాధితులపైనే కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. కారు కేసీఆర్ దే అయినా, స్టీరింగ్ మాత్రం మజ్లిస్​దేనని విమర్శించారు. ఎన్పీఆర్ అంటే కేసీఆర్ కు ఎందుకంత భయమని నిలదీశారు. ఉన్న డాక్యుమెంట్లు ఇస్తే సరిపోతుందని, పుట్టిన ఆధారాలు లేవని సీఎం అనడం చూస్తే ఆయన తెలంగాణలో పుట్టలేదా అనే అనుమానం కలుగుతుందన్నారు. సమగ్ర కుటుంబ సర్వే జరిపించిన కేసీఆర్.. ఎన్పీఆర్ ను తప్పుపట్టడం ఏమిటని ప్రశ్నించారు. సమగ్ర కుటుంబ సర్వేను రాజకీయంగా వాడుకున్న కేసీఆర్​కు ఎన్పీఆర్ ను విమర్శించే అర్హత లేదన్నారు.

See Alos: ఫీల్డ్​ అసిస్టెంట్లపై ప్రభుత్వం కఠిన నిర్ణయం

రైతు రుణమాఫీ: అర్హులను ఇలా గుర్తిస్తారు

ఇంటర్​ క్వశ్చన్ ​పేపర్లలో తప్పులే తప్పులు

నిజామాబాద్ ఎమ్మెల్సీ బరిలో కవిత