- సోలార్, థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఆమోదం
- డిప్యూటి సీఎం భట్టిని కలిసి లేఖ అందజేసిన ఆ రాష్ట్ర మంత్రి
హైదరాబాద్, వెలుగు: సింగరేణి సంస్థతో కలిసి తమ రాష్ట్రంలో 2,300 మెగావాట్ల సోలార్, థర్మల్ ప్రాజెక్టులు నిర్మించే ప్రతిపాదనకు రాజస్తాన్ కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ఆ రాష్ట్ర మంత్రి హీరాలాల్ నగర్ వెల్లడించారు. ఈమేరకు ఆయన గురువారం ప్రజా భవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి లేఖను అందజేశారు.
రాజస్తాన్‌కు చెందిన ‘రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగం లిమిటెడ్’ తో కలిసి సింగరేణి 1,500 మెగావాట్ల సోలార్, 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్లు నిర్మించేందుకు ఇటీవలే ఒప్పందం కుదుర్చుకుంది. రెండు రాష్ట్రాల విద్యుత్ అవసరాలకు ఈ కొత్త ప్రాజెక్టులు ఎంతో దోహద పడనున్నాయని, వీటిని త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎంకు హీరాలాల్విజ్ఞప్తి చేశారు.
సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా తొలిసారిగా రాజస్తాన్ రాష్ట్ర సర్కారుతో ఒప్పందం కుదుర్చుకుందని, ఇదే తరహాలో ఇతర రాష్ట్రాలతో కూడా గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజస్తాన్ కాలూరామ్, ప్రమోద్ శర్మ, సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఈడీ చిరంజీవి, జీఎం(కో ఆర్డినేషన్) టి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
