రాజస్థాన్​లోని బర్మేర్​లో దారుణం.. దళిత మహిళపై అఘాయిత్యం

రాజస్థాన్​లోని బర్మేర్​లో దారుణం.. దళిత మహిళపై అఘాయిత్యం

జైపూర్: రాజస్థాన్​లోని బర్మేర్ జిల్లాలో దళిత మహిళపై ఆత్యాచారానికి పాల్పడి ఆమెకు నిప్పంటించాడో కామాంధుడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు చికిత్స పొందుతూ మరణించింది. ఈ దారుణంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు నిరసనలు, ఆందోళనలకు దిగాయి. బాధిత మహిళ(30) గురువారం సాయంత్రం ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు షకూర్​ఖాన్ డోర్లు విరగ్గొట్టి ఇంట్లోకి చొరబడ్డాడు. 

ఆమెపై అత్యచారానికి పాల్పడి యాసిడ్ లాంటి కెమికల్ ఆమెపై చల్లి నిప్పంటించి పారిపోయాడు. మహిళ అరుపులు విని వచ్చిన చుట్టుపక్కల వారు మంటలార్పారు. అయితే, అప్పటికే గాయాలపాలైన మహిళను పోలీసులు జోధ్​పూర్​లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ట్రీట్​మెంట్​పొందుతూ బాధితురాలు శుక్రవారం రాత్రి చనిపోయింది. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐపీసీ 302, 376, 326 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు బర్మేర్​జిల్లా ఎస్పీ దిగంత్​ఆనంద్ తెలిపారు. 

పరారీలో ఉన్న షకూర్​ఖాన్​ను అరెస్టు చేశామని.. నిందితుడిది, బాధితురాలిది ఒకే గ్రామమని విచారణలో తేలిందని చెప్పారు. దళిత మహిళపై రేప్, సజీవదహనం ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి ఉదాహరణగా నిలుస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మహిళ రక్షణను ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించాయి. కాగా, ట్రీట్​మెంట్ అందడంలో జాప్యం కలగడం వల్లే బాధితురాలు చనిపోయిందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్​షెకావత్​ఆరోపించారు. సామాన్యుల జీవితాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే ఈ దారుణానికి కారణమని మంత్రి మండిపడ్డారు.