గువాహటి: ఐపీఎల్–19లో రాజస్తాన్ రాయల్స్ దూసుకుపోతోంది. ఛేజింగ్‌లో వైభవ్ సూర్యవంశీ (26 బాల్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 78), ధ్రువ్ జురెల్ (43 బాల్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 81 నాటౌట్) చెలరేగడంతో.. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాయల్స్ 6 వికెట్ల తేడాతో బెంగళూరుపై గెలిచింది. టాస్ ఓడిన బెంగళూరు 20 ఓవర్లలో 201/8 స్కోరు చేసింది. కెప్టెన్ రజత్ పటీదార్ (40 బాల్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63), విరాట్ కోహ్లీ (16 బాల్స్‌లో 7 ఫోర్లతో 32) రాణించారు. తర్వాత రాజస్తాన్ 18 ఓవర్లలో 202/4 స్కోరు చేసి గెలిచింది. వైభవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
రజత్, కోహ్లీ అదుర్స్..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు సరైన ఆరంభం లభించలేదు. ఇన్నింగ్స్ తొలి బాల్‌కే ఫిల్ సాల్ట్ (0) డకౌట్ కాగా.. కోహ్లీ, దేవదత్ పడిక్కల్ (14) వేగంగా ఆడారు. ఈ ఇద్దరు తొలి ఓవర్‌లో మూడు ఫోర్లతో టచ్‌లోకి వచ్చారు. తర్వాతి రెండు ఓవర్లలో కోహ్లీ ఐదు బౌండ్రీలు బాదగా, ఒక్క ఫోర్ కొట్టిన పడిక్కల్ వెనుదిరిగాడు. దాంతో ఆర్సీబ్ 45/2తో నిలిచింది. ఈ దశలో కెప్టెన్ రజత్ నిలకడగా ఆడినా.. రెండో ఎండ్‌లో రాయల్స్ బౌలర్లు విజృంభించారు. స్పిన్నర్ రవి బిష్ణోయ్ (2/32) తన వరుస ఓవర్లలో కోహ్లీ, క్రునాల్ పాండ్యా (1)ను ఔట్ చేశాడు.
తర్వాత బ్రిజేష్ శర్మ (2/37) కూడా తన వరుస ఓవర్లలో జితేష్ శర్మ (5), టిమ్ డేవిడ్ (13)ను పెవిలియన్‌కు పంపాడు. పవర్‌ప్లేలో 61/3 స్కోరు చేసిన బెంగళూరు 11 ఓవర్లలో 94/6తో కష్టాల్లో పడింది. రజత్‌తో జతకలిసిన రొమారియో షెఫర్డ్ (22) 6, 4, 4తో బ్యాట్ ఝుళిపించినా వికెట్ కాపాడుకోలేదు. జడేజా (1/14) బౌలింగ్‌లో ఔట్ కావడంతో ఏడో వికెట్‌కు 31 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది.
125/7 వద్ద వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ (29 నాటౌట్) రాయల్స్ బౌలర్లకు చుక్కలు చూపెట్టాడు. 15, 16వ ఓవర్‌లో పటీదార్ రెండు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 35 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. 17వ ఓవర్‌లో మరో రెండు సిక్స్‌లు కొట్టి 18వ ఓవర్‌లో వికెట్ ఇచ్చుకున్నాడు. ఎనిమిదో వికెట్‌కు 41 రన్స్ జతయ్యాయి. భువనేశ్వర్ (9 నాటౌట్) ఫోర్ కొట్టగా.. లాస్ట్ ఓవర్లో వెంకటేశ్ 4, 6, 6 దంచడంతో ఆర్సీబీ స్కోరు రెండొందలు దాటింది.
వైభవ్, జురెల్ ధనాధన్..
ఛేజింగ్‌లో వైభవ్ సూర్యవంశీ తన ట్రేడ్ మార్క్ షాట్లతో రెచ్చిపోయాడు. తొలి ఓవర్‌లో అతను రెండు ఫోర్లతో ఖాతా తెరవగా.. రెండో ఓవర్‌లో యశస్వి జైస్వాల్ (13) రెండు సిక్స్‌లు కొట్టి వెనుదిరిగాడు. మూడో ఓవర్‌లో 4, 4, 6 దంచిన వైభవ్ తర్వాతి ఓవర్‌లో 4, 4, 4, 6తో 19 రన్స్ రాబట్టాడు. నాలుగో ఓవర్‌లో భువనేశ్వర్ బాల్‌ను సిక్స్‌గా మలిచి 15 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇదే ఓవర్‌లో మరో ఫోర్‌తో 17 రన్స్ వచ్చాయి. అప్పటి వరకు స్ట్రయిక్ రొటేషన్ చేసిన ధ్రువ్ జురెల్ ఆరో ఓవర్‌లో 4, 6, 4, 6, 4తో 24 రన్స్ దంచాడు.
దాంతో రాయల్స్ 97/1తో పవర్‌ప్లేను ముగించింది. తర్వాతి రెండు ఓవర్లలో జురెల్ 4, 4, వైభవ్ 6, 6, 6 బాదారు. కానీ 9వ ఓవర్‌లో క్రునాల్ పాండ్యా (2/30) డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. వరుస బాల్స్‌లో వైభవ్, హెట్‌మయర్ (0) వికెట్లు తీశాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ (3) కూడా వెనుదిరగడంతో రాయల్స్ 137/4తో తొలి 10 ఓవర్లను ముగించింది. ఇక్కడి నుంచి బెంగళూరు బౌలర్లు రన్స్ కట్టడి చేసే ప్రయత్నం చేసినా.. జురెల్, జడేజా (24 నాటౌట్) బ్యాట్లు ఝుళిపించారు.
దాంతో తర్వాతి ఐదు ఓవర్లలో 40 రన్స్ రావడంతో రాయల్స్ 15 ఓవర్లలో 177/4తో విజయం దిశగా దూసుకెళ్లింది. ఈ క్రమంలో జురెల్ 25 బాల్స్‌లో ఫిఫ్టీ అందుకున్నాడు. ఇక 30 బాల్స్‌లో 25 రన్స్ చేయాల్సిన దశలో మరింత నిలకడగా ఆడిన జురెల్, జడేజా వికెట్ పడకుండా 12 బాల్స్ మిగిలి ఉండగానే విజయాన్ని అందించారు. హేజిల్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
సంక్షిప్త స్కోర్లు
బెంగళూరు: 20 ఓవర్లలో 201/8 (రజత్ 63, కోహ్లీ 32, రవి బిష్ణోయ్ 2/32).
రాజస్తాన్: 18 ఓవర్లలో 202/4 (జురెల్ 81*, వైభవ్ 78, క్రునాల్ 2/30).
15 ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 15 బాల్స్‌లోనే ఫిఫ్టీ కొట్టాడు. ఐపీఎల్‌లో థర్డ్ జాయింట్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇది. యశస్వి జైస్వాల్ (13 బాల్స్) టాప్‌లో ఉన్నాడు. సూర్యవంశీకి ఈ సీజన్‌లో ఇది రెండో ఫిఫ్టీ కాగా.. రెండుసార్లు 15 బాల్స్‌లోనే ఈ మార్కు అందుకున్నాడు.
5 ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ 200 ప్లస్ టార్గెట్లను సక్సెస్‌ఫుల్‌గా ఛేజ్ చేయడం ఇది ఐదోసారి. పంజాబ్ (9సార్లు), ముంబై (6సార్లు).. రాజస్తాన్ కంటే ముందున్నాయి.
