విషపూరిత పాముకాటుతో ‘స్నేక్ మ్యాన్’ మృతి

విషపూరిత పాముకాటుతో ‘స్నేక్ మ్యాన్’ మృతి

రాజస్థాన్‌లోని చురు జిల్లాలో స్నేక్ మ్యాన్ గా ప్రసిద్ధికెక్కిన వినోద్ తివారీ మృతి చెందారు. దాదాపు గత 20 ఏళ్లుగా పాములను పట్టుకోవడంలో దిట్ట అయిన వినోద్ తివారీ.. ఆఖరికి అదే పాముల చేతిలో తుదిశ్వాస విడిచారు. పాములను పట్టడం, వాటిని అడవిలో వదిలిపెడుతుండడంతో వినోద్ తివారీ అక్కడి స్థానికులకు బాగా పరిచయమున్న వ్యక్తిగా మారిపోయాడు. అయితే ఈ క్రమంలోనే విషపూరిత నాగుపామును పట్టుకునే సమయంలో పాము కాటుకు గురై తివారీ మృతి చెందాడు. చురులోని గోగమేడి ప్రాంతంలోని ఓ దుకాణంలోకి వచ్చిన నాగుపామును పట్టుకోవడానికి వచ్చిన తివారీ... దుకాణం వెలుపల ఉన్న నాగుపామును పట్టుకున్నాడు. దాన్ని సంచిలో వేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పాము అతని వేలి మీద కాటు వేసింది. 

ఇదంతా అక్కడి సీసీటీవీ వీడియోలో రికార్డ్ అయ్యింది. అతను పట్టుకున్న ఆ పాము అత్యంత విషపూరితమైనది కావడంతో పాము కాటు వేసిన నిమిషాల వ్యవధిలోనే తివారి మృతి చెందడం అక్కడి వారందర్నీ కలచి వేస్తోంది. వినోద్ తివారీ ఆ ప్రాంతంలో ఎక్కడ పాము కనిపించినా.. సమాచారం అందించగానే వచ్చి.. పట్టుకుని, సమీపంలోని అడవిలో వదిలేసేవాడు. అలా స్తానికులతో బాగా దగ్గరయ్యాడు. దీంతో అతడిని అందరూ 'స్నేక్ మ్యాన్' అని పిలవడం ఆనవాయితీగా మారిపోయింది. అనంతరం ఆయన అంత్యక్రియలకు పలువురు హాజరయ్యారు.