
రిజర్వేషన్లపై కాంగ్రెస్ చేస్తోన్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తప్పుడు ప్రచారంతో కాంగ్రెస్ ప్రజల్లో అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఫేక్ వీడియోలతో కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఎప్పుడైనా..ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రక్షించేది బీజేపీ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు మద్దతిచ్చేది కూడా బీజేపీనే అని చెప్పారు. ఇదే విషయాన్ని తాను గతంలో ప్రధాని నరేంద్ర మోదీకి కూడా చెప్పినట్లుగా అమిత్ షా గుర్తుచేశారు. గౌహతిలో విలేకరుల సమావేశంలో అమిత్ షా ఈ కామెంట్స్ చేశారు.
2023లో హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడిన వీడియోను ఎడిట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ గా మారింది. అందులో అమిత్ షా.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని మాట్లాడినట్లుగా ఉంది. దీంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు దాటితే రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోందంటూ పలువురు కాంగ్రెస్ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫేక్ వీడియోను కేంద్ర హోంశాఖ సీరియస్ గా తీసుకుంది. హైదరాబాద్ తో పాటుగా పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.