KKR vs DC: నరైన్ అరుదైన ఘనత.. మలింగ ఆల్‌టైం రికార్డ్ బ్రేక్

KKR vs DC: నరైన్ అరుదైన ఘనత.. మలింగ ఆల్‌టైం రికార్డ్ బ్రేక్

ఐపీఎల్ లో నరైన్ జోరు కొనసాగుతుంది. ఓ వైపు బ్యాటర్ గా.. మరోవైపు బౌలర్ గా సత్తా చాటుతున్నాడు. తన తొలి సీజన్ నుంచి ఇప్పటివరకు నిలకడగా రాణిస్తున్న అతి కొద్ది మంది ఆటగాళ్లలో నరైన్ ఒకడు. ఈ క్రమంలో ఒక ఆల్ టైం రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే వేదికపై అత్యధిక వికెట్లు తీసుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో నరైన్ మొత్తం 69 వికెట్లు పడగొట్టాడు. నిన్నటి వరకు 68 వికెట్లతో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన మలింగాతో సమంగా ఉన్నాడు. 

తాజాగా నిన్న (ఏప్రిల్ 29) ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో అక్షర్ పటేల్ వికెట్ తీయడం ద్వారా 69 వికెట్లతో మలింగాను ధాటి తన ఖాతాలో ఈ అరుదైన రికార్డ్ ను వేసుకున్నాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మలింగా 68 వికెట్లు పడగొట్టాడు. అమిత్ మిశ్రా ఢిల్లీలో (58), చాహల్ చిన్న స్వామి స్టేడియంలో 52 వికెట్లతో వరుసగా మూడు నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఈ మ్యాచ్ లో మొత్తం తన నాలుగు ఓవర్ల స్పెల్ లో నరైన్ కేవలం 24 పరుగులే ఇచ్చి వికెట్ పడగొట్టాడు.  

also read : KKR vs DC: దిగ్గజాలు కలిసిన వేళ.. గంగూలీకి షారుఖ్ సర్ ప్రైజ్

ఈ  మ్యాచ్ విషయానికి వస్తే.. సోమవారం(ఏప్రిల్ 29) ఈడెన్ వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కోల్‌క‌తా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట ఢిల్లీ 153 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని కోల్‌క‌తా ఓపెనర్ ఫిల్ సాల్ట్(68; 33 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఉఫ్ మని ఊదేశాడు. క్యాపిట‌ల్స్ బౌలర్లను చీల్చి చెండాడుతూ బౌండరీల వర్షం కురిపించాడు. అతని ధాటికి కోల్‌క‌తా మరో 21 బంతులు మిగిలివుండగానే లక్ష్యాన్ని చేధించింది.