భారత కార్పొరేట్ రంగంలో మరో భారీ కుంభకోణం కలకలం రేపుతోంది. ప్రముఖ బంగారు ఆభరణాల ఎగుమతి సంస్థ 'రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్' సుమారు రూ. 15లక్షల 15వేల కోట్ల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లోనే ఈ కంపెనీ షేర్లు 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకి రూ.103.92 కొనసాగుతున్నాయి. కంపెనీ చైర్మన్ రాజేశ్ మెహతాతో పాటు సంస్థపై సెబీ షేర్ మార్కెట్ నిషేధం విధించింది.
ఎలా మోసం చేశారు?
రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ తమ కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ను భారీగా తారుమారు చేసిందని ప్రాథమిక దర్యాప్తులో సెబీ గుర్తించింది. కంపెనీకి వచ్చే ఆదాయంలో దాదాపు 97 నుంచి 99 శాతం విదేశీ అనుబంధ సంస్థలు.. ముఖ్యంగా స్విట్జర్లాండ్‌కు చెందిన వాల్‌కాంభి ఎస్ఏ నుంచే వస్తున్నట్లు చూపించారు. తీరా చూస్తే ఆ కంపెనీల ఒరిజినల్ ఆడిట్ రిపోర్టులను బయటపెట్టలేదు. పైగా వాల్‌కాంభి వాస్తవ ఆదాయం చాలా స్వల్పంగా ఉంది. కేవలం గోల్డ్ రిఫైనింగ్ కమిషన్‌ను చూపించకుండా.. మొత్తం బంగారం విలువనే ఆదాయంగా చూపుతూ మాయాజాలం చేశారు. అలాగే చైర్మన్ రాజేశ్ మెహతా సొంతంగా చేసిన రూ.11వేల 400 కోట్ల డెరివేటివ్ లావాదేవీలను కంపెనీ అమ్మకాలు, కొనుగోళ్లుగా చూపి ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించారు.
ఎల్‌ఐసీకి భారీ షాక్.. కోట్లలో నష్టం
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఇన్సూరెన్స్ దిగ్గజం LICకి ఈ కంపెనీలో భారీగా పెట్టుబడులు ఉన్నాయి. మార్చి 2026 త్రైమాసిక నివేదికల ప్రకారం.. ఎల్‌ఐసీకి రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్‌లో ఏకంగా 10.80 శాతం వాటా ఉంది. విశేషం ఏంటంటే.. సెప్టెంబర్ 2023 నుంచి ఎల్‌ఐసీ తన వాటాను ఒక్క షేరు కూడా మార్చకుండా అలాగే ఉంచేసింది. 2026 ప్రారంభంలో ఈ ఎల్‌ఐసీ వాటా విలువ రూ.637 కోట్లుగా ఉండగా.. ప్రస్తుత స్టాక్ పతనంతో అది రూ.347 కోట్లకు పడిపోయింది. అంటే కేవలం కొద్ది నెలల్లోనే ఎల్‌ఐసీకి దాదాపు రూ.290 కోట్ల నష్టం వచ్చింది ఈ పెట్టుబడి ద్వారా.
మరి ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి?
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు గత 3 ఏళ్లుగా తెలివిగా ఈ కంపెనీ నుంచి తప్పుకుంటున్నారు. మార్చి 2023లో 17.60 శాతంగా ఉన్న విదేశీ ఇన్వెస్టర్ల వాటా.. మార్చి 2026 నాటికి 14.26 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం బ్రిడ్జ్ ఇండియా ఫండ్ 8.46%, స్క్వాబ్ ఫండమెంటల్ ఈటీఎఫ్ 2.70% మాత్రమే ఇందులో ప్రధాన విదేశీ పెట్టుబడిదారులుగా ఉన్నారు. ఈ ఏడాది మొదట్లో రూ.838 కోట్లుగా ఉన్న ఎఫ్‌ఐఐల పెట్టుబడి విలువ కంపెనీలో ఇప్పుడు రూ.456 కోట్లకు క్షీణించింది.
గతంలోనూ వివాదాలు..
రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. ఆర్థిక సంవత్సరం 2023కి సంబంధించిన క్యాష్-ఫ్లో స్టేట్‌మెంట్లను సమర్పించలేదని గతంలోనే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(NSE) ఈ కంపెనీని వివరణ కోరింది. ఆడిట్ నివేదికలను సరిగ్గా ఇవ్వకుండా కంపెనీ నిర్లక్ష్యం వహించింది. ప్రస్తుత మోసం తీవ్రత దృష్ట్యా కంపెనీ స్టాట్యుటరీ ఆడిటర్ల పాత్రను కూడా నిశితంగా పరిశీలించాలని నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీకి సెబీ ఈ వ్యవహారాన్ని అప్పగించింది.
షేర్లు కొన్న ఇన్వెస్టర్ల భవిష్యత్తు ఏంటి?
గడిచిన ఏడాది కాలంలోనే ఈ స్టాక్ సుమారు 40 శాతం మేర పతనమైంది. జూన్ 5 నాటి ట్రేడింగ్‌లోనూ 5 శాతం నష్టంతో రూ.103 వద్దే ఓపెన్ అయింది. సెబీ పూర్తిస్థాయి దర్యాప్తు ముగిసేవరకు కంపెనీ యాజమాన్యం మార్కెట్ లావాదేవీలు జరపకుండా నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. కంపెనీలో అకౌంటింగ్ మోసాలు నిజమని తేలితే షేరు విలువ మరింత పడిపోయే ప్రమాదం ఉంది. దీంతో పెట్టుబడులు పెట్టి చిక్కుకుపోయిన చిన్న ఇన్వెస్టర్ల భవితవ్యం ఇప్పుడు గందరగోళంలో పడింది.
