రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు డిమాండ్... గజం 45 వేలు పలికిన తొర్రూరు ప్లాట్లు

రాజీవ్ స్వగృహ  ఓపెన్ ప్లాట్లకు డిమాండ్... గజం 45 వేలు పలికిన తొర్రూరు ప్లాట్లు
  •     కార్పొరేషన్ కు  రూ.56 కోట్ల ఆదాయం

హైదరాబాద్, వెలుగు:   రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఓపెన్ ప్లాట్ల కొనుగోలుకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టుకు సమీపంలో తొర్రూర్ వద్ద ఉన్న105 ప్లాట్ల బహిరంగ వేలం ప్రక్రియలో కొనుగోలుదారులు భారీగా పాల్గొన్నారు. రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ వేలం పాట శనివారం బాట సింగారంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ప్రారంభమైంది. తొలిరోజున 70 ప్లాట్లను విక్రయించారు. ఓపెన్ ప్లాట్లను గరిష్టంగా చదరపు గజం రూ. 45 వేల చొప్పున కొనుగోలు చేశారు. 

తొర్రూర్ తోపాటు ఓఆర్ఆర్ కు సమీపంలోని బహదూర్ పల్లి, కుర్మల్ గూడ ప్రాంతాల్లోని ఓపెన్ ప్లాట్లను వేలం ద్వారా విక్రయించడానికి రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ గత నెలలో నోటిఫికేషన్ విడుదల చేసింది. శనివారం వీటి వేలం ద్వారా సుమారు రూ. 56 కోట్ల మేర ఆదాయం వచ్చిందని కార్పొరేషన్ ఎండీ వీపీగౌతం తెలిపారు. 200 నుంచి 300 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఈ ప్లాట్ల చదరపు గజం కనీస ధర (అప్ సెట్ ప్రైజ్) రూ.25 వేలుగా నిర్ణయించగా, కొన్ని ప్లాట్లను రూ.45 వేలు, 43 వేలు, 41 వేలకు కూడా కొనుగోలు చేశారు. 

ఇక్కడ వేలం వేసిన భూములు సగటున చదరపు గజం 31 వేలకు చొప్పున అమ్ముడు పోయాయి. వేలం నిర్వహణలో కార్పొరేషన్ సీఈ రమణారెడ్డి, ఈఈ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొర్రూర్ లే అవుట్ లోని35 ఓపెన్ ప్లాట్లకు, బహదూర్ పల్లి, కుర్మల్ గూడలోని మరో 32 ఓపెన్ ప్లాట్లకు ఆదివారం వేలం నిర్వహించనున్నారు. 

పోచారం, బండ్లగూడల్లో 71 ఫ్లాట్ల కేటాయింపు 

రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ బండ్లగూడ నాగోలు, పోచారం ప్రాంతాల్లో నిర్మించిన గేటెడ్ కమ్యూనిటీ మధ్యతరగతి, అల్పాదాయ వర్గాల కోసం ప్రత్యేకించిన ఫ్లాట్లలో 71 ఫ్లాట్ల లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేశారు. దీంతె కార్పొరేషన్ కు సుమారు రూ.11 కోట్ల వరకు ఆదాయం వచ్చింది.