
- రిజర్వాయర్ మరమ్మతు పనులకు మంత్రి ఉత్తమ్ హామీ
- కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నియమించిన పుణె కమిటీ
- తాజాగా ప్రాజెక్ట్ ను పరిశీలించిన నీటిపారుదల శాఖ మంత్రి
- రూ.144 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన ఆఫీసర్లు
- రిజర్వాయర్ ఆయకట్టు రైతుల్లో మళ్లీ చిగురిస్తోన్న ఆశలు
గద్వాల, వెలుగు : కృష్ణానదిపై ఏర్పాటైన ఎత్తిపోతల ప్రాజెక్టుల్లో ఒకటైన నెట్టెంపాడులో భాగమైన ర్యాలంపాడు రిజర్వాయర్ రిపేర్లపై నెలకొన్న సందిగ్ధత త్వరలోనే తొలగనుంది. తాజాగా రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రిజర్వాయర్ ను పరిశీలించి రిపేర్లు చేయిస్తామని హామీతో ఇవ్వడంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురించాయి.
కాగా.. ర్యాలంపాడు రిజర్వాయర్ కట్టకు బుంగలు పడి నీళ్లు లీక్ అవుతుండగా.. కొన్నేండ్లుగా సగం ఆయకట్టుకు కూడా నీళ్లిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఆరేండ్ల కిందటే కట్టకు లీకేజీలను గుర్తించినా ఆఫీసర్లు పట్టించుకోలేదు. చివరకు రైతుల ఆందోళనలతో గత సర్కార్ రిజర్వాయర్ కు రిపేర్లు చేస్తామని చెప్పినా చేయలేదు. కేవలం సర్వేల పేరుతోనే కాలయాపన చేసింది.
ఆరేండ్ల కింద సీపేజీ గుర్తించినా..
గద్వాల జిల్లా ధరూర్ మండలం ర్యాలంపాడు సమీపంలో రిజర్వాయర్ ను 4 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో గత కాంగ్రెస్ సర్కార్ హయాంలో నిర్మించారు. రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పాలనలో మెయింటెనెన్స్ కు కనీసం డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో రిజర్వాయర్ కట్ట, కెనాల్స్ దెబ్బతిన్నాయి. 2019లో రిజర్వాయర్ కట్ట నుంచి నీళ్లు లీక్ అవుతున్నట్టు అఫీసర్లు గుర్తించారు.
కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సీపేజీ పెరిగిపోయింది. కట్టకు బుంగలు పడి ఏండ్లు గడుస్తున్నా రిపేర్లపై గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండడంతో రైతుల ఆందోళనల కారణంగా 2021లో రిటైర్డ్ ఇంజనీర్ల బృందం పరిశీలించి.. రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి లో నీళ్లు నింపితే కట్టకు ప్రమాదమని చెప్పింది. అందులో నీటి నిల్వ సామర్థ్యాన్ని సగానికి తగ్గించింది. అనంతరం లీకేజీల కంట్రోల్ కోసం ఇరిగేషన్ ఆఫీసర్లు చేపట్టిన సర్వేకే ఏడాది కాలం పట్టింది.
ఆయా పనులను టెండర్ ద్వారా హైదరాబాద్ కు చెందిన శ్రీ సాయి గణేశ్ కంపెనీ దక్కించుకుంది. రిజర్వాయర్ కు బుంగలు ఎలా పడ్డాయి..? ఎలా పూడ్చాలి..? వంటి అంశాలపై అప్పటి సర్కార్ కు రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్‌ను ఆఫీసర్లు సీడీవో (సెంట్రల్ డిజైన్‌ఆఫీస్)కు ఫార్వర్డ్ చేశారు. అయినా రిపేర్లపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ లో కొన్నాళ్ల కింది పుణె కమిటీ పరిశీలన
చేసింది.
మంత్రి ఉత్తమ్ విజిట్ తో రైతుల్లో ఆశలు
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాలుగు రోజుల కింద ర్యాలంపాడ్ రిజర్వాయర్ ను పరిశీలించారు. నెట్టెంపాడు లిఫ్ట్ స్కీమ్ లో మిగిలిన10 శాతం పెండింగ్ పనులు, ర్యాలంపాడ్ రిజర్వాయర్ రిపేర్లను దాదాపు రూ. 2,327 కోట్లతో కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రిపేర్లు త్వరగా అవుతాయని ఆశ రైతుల్లో నెలకొంది. తొందరలోనే రిజర్వాయర్ రిపేర్లు కంప్లీట్ చేస్తే నడిగడ్డలోనూ సాగునీటి ఇబ్బందులు తొలగుతాయి.
రిపేర్లకు రూ. 144 కోట్లతో అంచనా
రిజర్వాయర్ బుంగల రిపేర్లకు రూ.144 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. కానీ రిపేర్లు ఏ విధంగా చేయాలి. ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై క్లారిటీ లేకపోవడంతో సందిగ్ధత నెలకొంది. దీనిపై పుణె కమిటీ ఎలా ముందుకెళ్లాలనే దానిపై ప్రయత్నిస్తుంది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వలేదు. త్వరలోనే నిర్ణయం రావచ్చని ఆఫీసర్లు పేర్కొంటున్నారు.
ఈసారి కూడా సగం ఆయకట్టుకే నీటి సరఫరా
నెట్టెంపాడ్ లిఫ్ట్ స్కీమ్ కింద ఏడు రిజర్వాయర్లలో ర్యాలంపాడ్ నే పెద్దది. ఇది 4 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. లెఫ్ట్ కెనాల్ ద్వారా 25 వేల ఎకరాలు, రైట్ కెనాల్ ద్వారా 1.11 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రస్తుతం 2 టీఎంసీలే నిల్వ ఉంచుతుండడంతో పూర్తిస్థాయిలో ఆయకట్టు సాగుకు ఇబ్బందిగా మారింది.
ఈసారి సీజన్ లో కూడా 2 టీఎంసీలకు మించి నీరు నిల్వ చేసుకునే పరిస్థితి లేకపోవడంతో రైతులకు నిరాశ తప్పడంలేదు. చివరి దశలో పంటలకు నీటి సరఫరా ఇబ్బందులు రావొచ్చని ఆఫీసర్లు చెబుతున్నారు. రిపేర్లు లేకపోవడంతో ఈసారి జూరాల ప్రాజెక్టుకు వరద భారీగా వస్తున్నప్పటికీ నెట్టెంపాడు లిఫ్ట్ కు నీరు ఎత్తిపోసుకోలేని పరిస్థితి ఉంది. పది రోజుల్లోనే రెండు టీఎంసీల నీరు నిల్వ చేయడంతో 15 రోజులుగా నెట్టెంపాడు లిఫ్ట్ కు నీటిని తరలించే మోటార్లను బంద్ పెట్టారు. దిగువకు మాత్రం లక్షల క్యూసెక్కుల వరద వెళ్తుంది.
సీరియస్ గా ఫోకస్ పెట్టిన సర్కార్
నెట్టెంపాడు లిఫ్ట్ పరిధిలోని పెండింగ్ పనులు, ర్యాలంపాడ్ రిజర్వాయర్ రిపేర్లపై ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. త్వరలోనే అన్నింటికీ పరిష్కారం లభించనుంది. వానాకాలం సీజన్ లో నెట్టెంపాడు కింద ఆయకట్టుకు ఎలాంటి ఇబ్బంది రానీయం. నిర్దేశిత ఆయకట్టుకు ప్రతి ఎకరాకు నీరు అందిస్తాం. ఇంకా నీళ్లు ఎత్తి తోడి పోసుకునే చాన్స్ కూడా ఉంది.
- రహీముద్దీన్, ఎస్ఈ, ఇరిగేషన్ శాఖ-