రామ మందిర ప్రారంభం ఎన్నో ఏండ్ల కల : కిషన్ రెడ్డి

రామ మందిర ప్రారంభం ఎన్నో ఏండ్ల కల : కిషన్ రెడ్డి
  •  హిందువుల ఆకాంక్ష నెరవేరుతున్నది

బషీర్ బాగ్, వెలుగు : ఎన్నో ఏండ్ల హిందువుల ఆకాంక్ష ఈనెల 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభంతో నెరవేరుతుందని  కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు.. ఆలయాల స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ బషీర్‌‌బాగ్‌లోని కనకదుర్గమ్మ ఆలయాన్ని కిషన్‌రెడ్డి క్లీన్ చేశారు.  ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలిసి ఆలయంలోని చెత్తను తొలగించారు. ఆలయ గోపురాన్ని నీళ్లతో కడిగారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. ‘స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరగనున్న అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకను భక్తులు విజయవంతం చేయాలి.

 రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో 150 దేశాల నుంచి భక్తులు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొంటున్నారు. ఎంతోమంది బలిదానాలు చేసిన తర్వాత అయోధ్యలో శ్రీరాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నది’ అని కిషన్ రెడ్డి అన్నారు.  హిందువుల ఆత్మ గౌరవానికి సంబంధించిన ఈ ఆధ్యాత్మిక వేడుకలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నెల 22న ప్రతి ఒక్కరి ఇంట్లో పండుగ వాతావరణం ఉండాలన్నారు.  టెంపుల్​కు వెళ్లి రామజ్యోతులు వెలిగించాలని కోరారు.