నకిలీ చెక్కులతో మోసం.. రామ మందిర ట్రస్టు డబ్బులను కొట్టేసిన కేటుగాళ్లు

నకిలీ చెక్కులతో మోసం.. రామ మందిర ట్రస్టు డబ్బులను కొట్టేసిన కేటుగాళ్లు

లక్నో:అయోధ్యలోని రామ మందిర నిర్మాణ పనులు వేగవంతం అవుతున్నాయి. ఈ తరుణంలో ఆలయ ట్రస్టు బ్యాంక్ అకౌంట్ నుంచి కొందరు కేటుగాళ్లు డబ్బులు కొట్టేయడం సంచలనంగా మారింది.ఆలయ నిర్మాణానికి విరాళాలను సేకరించే శ్రీ రామ జన్మభూమి తీర్ఝ క్షేత్ర ట్రస్టు బ్యాంకు అకౌంట్ నుంచి క్లోన్డ్ (నకిలీ) చెక్స్‌‌ను ఉపయోగించి రూ.6 లక్షలను మోసగాళ్లు కొట్టేశారు. రూ. రూ.2.5 లక్షలు, రూ.3.5 లక్షల క్లోన్డ్ చెక్స్‌ను ఉపయోగించి డబ్బులను విత్‌డ్రా చేశారని అయోధ్య డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ దీపక్ కుమార్ తెలిపారు. ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామన్నారు.

డబ్బులను విత్‌డ్రా చేయడానికి సదరు మోసగాళ్లు వాడిన సీరియల్ నంబర్స్‌తో ఉన్న అసలు చెక్స్ తమ వద్దే ఉన్నాయని ట్రస్ట్ వర్గాలు స్పష్టం చేశాయి. మూడో క్లోన్ చెక్ (రూ.9.86 లక్షలు) క్లియరెన్స్ కోసం బుధవారం మధ్యాహ్నం బ్యాంక్ నుంచి తనకు వెరిఫికేషన్ కాల్ రావడతో ఈ మోసం గురించి రాయ్ పసిగట్టారు. మొదటి రెండు క్లోన్డ్ చెక్స్‌తో డబ్బులు విత్‌డ్రా చేసిన ఘటన ఈ నెల 1 నుంచి 3వ తేదీ మధ్య జరిగి ఉండొచ్చునని తెలుస్తోంది. ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు సదరు బ్యాంకు నుంచి మొదలవుతుందని, ఇందులో బ్యాంకు అధికారుల ప్రమేయం పైనా ఇన్వెస్టిగేట్ చేస్తామని దీపక్ పేర్కొన్నారు. క్లోన్డ్ చెక్స్‌పై రాయ్‌తోపాటు ట్రస్ట్‌లోని మరో సభ్యుడి ఫోర్జరీ సంతకాలు ఉన్నాయని వివరించారు.