రూ.248.66 కోట్లతో రామగుండం బడ్జెట్

రూ.248.66 కోట్లతో రామగుండం బడ్జెట్

గోదావరిఖని, వెలుగు :  రామగుండం కార్పొరేషన్​లో 2026–-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్​ను బుధవారం మేయర్​ మహాంకాళి స్వామి అధ్యక్షతన జరిగిన బడ్జెట్ ప్రత్యేక సమావేశంలో ఆమోదించారు. ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.248 కోట్ల 66 లక్షల 51 వేలు కాగా వ్యయం రూ.220 కోట్ల 57 లక్షల 76 వేలు, మిగులు రూ.28 కోట్ల 8 లక్షల 75 వేలుగా అంచనా వేశారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు సభ్యులు ఆమోదం తెలిపారు. అనంతరం మొదటి సాధారణ సమావేశం నిర్వహించారు. ఇందులో ఎనిమిది అంశాలు ప్రవేశపెట్టగా వాటిని సభ్యులు ఆమోదించారు. కార్పొరేషన్​లో ఔట్ సోర్సింగ్​, కాంటాక్ట్ విధానంలో ఆయా విభాగాల్లో పని చేస్తున్న సిబ్బంది కాల పరిమితిని మరో ఏడాది పొడిగిస్తూ తీర్మానం చేశారు. 

ఆ తరువాత పలువురు కార్పొరేటర్లు తమ డివిజన్ సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మేయర్ మహాంకాళి స్వామి మాట్లాడుతూ కార్పొరేటర్లు సభ దృష్టికి తెచ్చిన సమస్యలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ పరిష్కరించాలని అధికారులకు సూచించారు.  త్వరలో రూ.1.25 కోట్ల విలువైన టెండర్లు తెరిచి అభివృద్ధి  పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. రామగుండం కార్పొరేషన్​ ప్రాంతాన్ని సకల వసతులతో కూడిన సుందర నగరంగా అభివృద్ధి చేయడానికి కార్పొరేటర్లు సహకరించాలని కోరారు.