జల విద్యుత్, సోలార్ పవర్ పెరిగింది.. ఎన్టీపీసీలో విద్యుత్  ఉత్పత్తి నిలిపివేత

జల విద్యుత్, సోలార్ పవర్ పెరిగింది.. ఎన్టీపీసీలో విద్యుత్  ఉత్పత్తి నిలిపివేత

గోదావరిఖని, వెలుగు: జల విద్యుత్, సోలార్​ పవర్​ పెరగడంతో పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్​లోని పలు యూనిట్లను షట్​ డౌన్​ చేసి విద్యుత్​ ఉత్పత్తిని నిలిపివేశారు. శనివారం రాత్రి నుంచి పలు ధపాలుగా విద్యుత్​ ఉత్పత్తికి బ్రేక్​ వేశారు.

తెలంగాణ ప్లాంట్​లోని 800 మెగావాట్ల మొదటి యూనిట్, రామగుండం ప్లాంట్​లోని 200 మెగావాట్ల మూడు యూనిట్లు, 500 మెగావాట్ల 5వ యూనిట్​లో విద్యుత్​ ఉత్పత్తికి బ్రేక్​ పడింది. గుజరాత్​లోని ఖావ్డాలోని 165 మెగావాట్ల సోలార్​ పవర్​ను నేషనల్​ గ్రిడ్​కు అనుసంధానం చేయడం, దేశంలోని పలు ప్రాంతాల్లో సోలార్​ విద్యుత్​​ఉత్పత్తి పెరగడం, నాలుగు రోజులుగా ఉత్తర భారతంలో భారీగా వర్షాలు కురవడంతో జల విద్యుత్​ ఉత్పత్తి కూడా పెరిగింది. ఇటీవల విద్యుత్​ వినియోగం తగ్గడంతో విద్యుత్​ ఉత్పత్తిని నిలిపివేశామని, అవసరాన్ని బట్టి ఉత్పత్తి ప్రారంభిస్తామని ఎన్టీపీసీ అధికారులు తెలిపారు.