- కొత్త మైన్తో స్థానికులకు ఉద్యోగాలు..
- 18 ఏండ్ల పాటు మంచి క్వాలిటీ బొగ్గు ఉత్పత్తి
- బీఆర్ఎస్ హయాంలో కొత్త బొగ్గు గనులు రాకుండా అడ్డుకున్నరు
- కొత్త మైన్ ఏర్పాటుపై సింగరేణి ఆఫీసర్లతో చర్చించిన మంత్రి
- మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో పర్యటన
కోల్‌బెల్ట్/ ఘట్కేసర్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఓపెన్‌కాస్ట్ విస్తరణలో భాగంగా ఫేజ్-2 కొత్త బొగ్గు గని మంజూరైందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో పర్యటించిన మంత్రి.. గద్దెరాగడిలో సింగరేణి మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్.రాధాకృష్ణ, ఎస్టేట్ ఆఫీసర్ నవనీత, ఇతర ఆఫీసర్లతో సమావేశమయ్యారు. కొత్త మైన్‌కు అవసరమైన భూ కేటాయింపు, ఫారెస్ట్ క్లియరెన్స్, గని ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
కొత్త గని వివరాలను మ్యాప్ ద్వారా అధికారులు మంత్రికి వివరించారు. రామకృష్ణాపూర్ ఓపెన్‌కాస్ట్ ఫేజ్-2 బొగ్గు గని ప్రారంభమైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతోపాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి అన్నారు. గని కోసం 311 హెక్టార్ల భూమి అవసరం కాగా ఫారెస్ట్ క్లియరెన్స్ రావాల్సిఉందన్నారు. భూమి రిజర్వు ఫారెస్ట్‌లో ఉందంటూ క్లియరెన్స్ ఇవ్వడంలో ఫారెస్ట్ ఆఫీసర్లు జాప్యం చేస్తున్నారని చెప్పారు. ఈ భూమి చాలాకాలంగా నాన్ఫారెస్ట్ఏరియాగానే ఉన్నట్టు రికార్డుల్లో ఉందన్నారు.
కొత్త మైన్ ఏర్పాటుకు సహకరించి క్లియరెన్స్ ఇవ్వాలని ఇప్పటికే డీఎఫ్ఓను, అటవీశాఖ ఉన్నతాధికారులను కోరినట్టు చెప్పారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరేణిలో ఒక్క కొత్త బొగ్గు గని తవ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వేలం ప్రక్రియలో సింగరేణి పాల్గొనకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుందని, సింగరేణిలో కొత్త బొగ్గు గనుల ఏర్పాటును పట్టించుకోకుండా ఒడిశాలో ఏటా 25 మిలియన్ టన్నుల కెపాసిటీ బొగ్గు గని కోసం టెండర్లలో పాల్గొందని విమర్శించారు. బీఆర్ఎస్ సర్కార్ నిర్వాకం వల్ల అక్కడివాళ్లకే ఉద్యోగాలు వచ్చాయన్నారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త బొగ్గు గనులను దక్కించుకోవడం కోసం వేలం పాటలో సింగరేణి సంస్థ పాల్గొనేలా తాను సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించినట్టు చెప్పారు. కార్యక్రమంలో మందమర్రి సీఐ పర్స రమేశ్, డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్‌రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ పల్లె రాజు, కాంగ్రెస్ సీనియర్ లీడర్లు బండి సదానందం యాదవ్, గాండ్ల సమ్మయ్య, గోపతి బానేశ్, గోపు రాజం, కుర్మ సురేందర్, కౌన్సిలర్లు భీమ మల్లేశ్, కూతురు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్లో చేరిన సర్పంచులు
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పోన్నారం, పులిమడుగు, మామిడిగట్టు సర్పంచులు, వార్డు సభ్యులు, పలువురు బీఆర్ఎస్ లీడర్లు మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. గురువారం రాత్రి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్లో ప్రజాప్రతినిధులు మంత్రిని కలిశారు. బీఆర్ఎస్కు చెందిన పొన్నారంసర్పంచ్ పెంచాల మధు, మామిడిట్టు సర్పంచ్ సుంకరి దివ్యాసతీశ్, పులిమడుగు సర్పంచ్ బుక్క దేవిమోహన్, వార్డు సభ్యులు సతీశ్ గౌడ్, నాగరాజు, దుర్గం కుమార్ తదితరులకు మంత్రి కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి వివేక్ వెంకటస్వామి చేపట్టిన అభివృద్ది పనులు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్లో చేరినట్టు చెప్పారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ 7వ వార్డు కాంగ్రెస్ కౌన్సి లర్ గుర్రం శ్రీనివాస్ నాన్నమ్మ తూటి లింగమ్మ ఇటీవల చనిపోగా శుక్రవారం గద్దెరాగడిలో నిర్వహించిన దశదినకర్మలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. లింగమ్మ ఫొటోకు నివాళులు అర్పించారు.
ప్రతి విద్యార్థి స్కిల్స్ పెంపొందించుకోవాలి
ప్రతి విద్యార్థి స్కిల్స్ పెంపొందించుకోవాలని, విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో నైపుణ్యాల పాత్ర అత్యంత కీలకమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆధునిక పోటీ ప్రపంచంలో ముందంజలో నిలవాలంటే విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో శుక్రవారం నిర్వహించిన స్యాప్ కోడ్ ఇన్నోవేషన్ కార్యక్రమానికి ఆయన చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు. కాలేజీలో ఏర్పాటు చేసిన స్యాప్ కోడ్ ఇన్నోవేషన్ రూమ్‌ను ప్రారంభించి మాట్లాడారు.
రైజింగ్ తెలంగాణ లక్ష్యం 2047 నాటికి రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి నైపుణ్యాలలో ప్రతిభ కనబరిచే స్థాయికి చేరుకుంటారని పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలన్నారు. విద్యార్థుల్లో సాంకేతిక దక్షతను పెంపొందించేందుకు కాలేజీల్లో ఇలాంటి ఇన్నోవేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో కేపీఆర్ఐటీ చైర్మన్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
