మూసీ అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు..ఇండ్ల కూల్చివేతలనే అపోజ్‌‌‌‌ చేస్తున్నం: రాంచందర్‌‌‌‌‌‌‌‌రావు 

మూసీ అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు..ఇండ్ల కూల్చివేతలనే అపోజ్‌‌‌‌ చేస్తున్నం: రాంచందర్‌‌‌‌‌‌‌‌రావు 
  • ముందు పునరావాసం కల్పించిన తర్వాతే పనులు చేపట్టాలి 
  • సీఎం పీపీటీకి మా పార్టీ అటెండ్ కావట్లేదని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: మూసీ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, ప్రాజెక్టు పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లను కూల్చడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌‌‌‌‌‌‌‌రావు వెల్లడించారు. మూసీ నది పునరుజ్జీవనం కావాలని, రైతులకు స్వచ్ఛమైన సాగునీరు అందాలన్నదే బీజేపీ ఆకాంక్ష అన్నారు. అభివృద్ధి పేరుతో ప్రజలను నిరాశ్రయులను చేయడం అన్యాయమన్నారు.

 శుక్రవారం హైదరాబాద్‌‌‌‌లోని బీజేపీ స్టేట్ ఆఫీస్​లో రాంచందర్‌‌‌‌‌‌‌‌రావు మీడియాతో మాట్లాడారు. మూసీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ కాంగ్రెస్ నేతలు పదేపదే తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. సీఎం పవర్ పాయింట్ ప్రజేంటేషన్‌‌‌‌కు తమ పార్టీ నుంచి ఎవ్వరూ హాజరు కావడం లేదని పేర్కొన్నారు.

నదుల ప్రక్షాళన ఎలా చేయాలో గుజరాత్‌‌‌‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చూసి నేర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఒకప్పుడు సబర్మతి కూడా మూసీలాగే కలుషితమై ఉండేదని,  నరేంద్ర మోదీ సీఎంగా ఉన్నప్పుడు నర్మదా నది నీటిని మళ్లించి ముందుగా నదిని శుద్ధి చేశారని గుర్తుచేశారు.

అక్కడ నివసించే 4 వేల కుటుంబాలకు ముందుగా పునరావాసం కల్పించి, ప్రత్యామ్నాయ ఇండ్లు ఇచ్చిన తర్వాతే ప్రాజెక్టు పనులు చేపట్టారని పేర్కొన్నారు. మధుబన్ పార్క్, విఘ్నేశ్వర్ కాలనీలాంటి చోట్ల చట్టబద్ధంగా నిర్మించుకున్న ఇండ్లను కూల్చాల్సిన అవసరం లేదని, అవసరమైతే గాంధీ సరోవర్ ప్రాజెక్టును రీలైన్ చేయాలని డిమాండ్ చేశారు. పేదల ఇండ్లు కూల్చకుండానే మూసీని ప్రక్షాళన చేయవచ్చని అభిప్రాయపడ్డారు. 

గ్యాస్, పెట్రోల్‌‌‌‌పై కాంగ్రెస్‌‌‌‌ దుష్ర్పచారం..

దేశంలో ఇంధన కొరత ఏర్పడుతుందంటూ రాహుల్‌‌‌‌గాంధీ సహా కాంగ్రెస్ నేతలు దుష్ర్పచారం చేస్తున్నారని, ఈ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని రాంచందర్‌‌‌‌‌‌‌‌రావు విమర్శించారు. ప్రపంచంలో యుద్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశానికి రావాల్సిన చమురు, గ్యాస్ సరఫరాల్లో అంతరాయం లేకుండా ప్రధాని మోదీ, మంత్రి జైశంకర్ తగిన చర్యలు తీసుకున్నారని తెలిపారు.

హార్మూజ్ జలసంధి ద్వారా సరఫరా సజావుగా సాగేలా కేంద్రం నిరంతరం పర్యవేక్షిస్తున్నదని చెప్పారు. భారత్ కేవలం ఒకే ప్రాంతంపై ఆధారపడడం లేదని, 40 శాతం ముడి చమురు ఇతర దేశాల నుంచి వస్తున్నదని వివరించారు. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల కొరత ఉండదని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావొద్దని ఆయన భరోసా ఇచ్చారు.