హైదరాబాద్, వెలుగు: రామ్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఐడీసీ)తో కలిసి ఢిఘీ పోర్ట్ ఇండస్ట్రియల్ ఏరియాలో హై-టెక్ ఫార్మాస్యూటికల్ పార్క్‌ను అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం కన్సెషన్ ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ప్రాజెక్ట్ పబ్లిక్-–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో, డిజైన్–బిల్డ్–ఫైనాన్స్–ఆపరేట్–ట్రాన్స్‌ఫర్ (డీబీఎఫ్‌ఓటీ) మోడల్ ద్వారా అమలు కానుంది. సబ్సిడరీ కంపెనీ మహా ఇంటిగ్రేటెడ్ లైఫ్ సైన్సెస్ (మైల్స్ సిటీ) ద్వారా ఈ ప్రాజెక్ట్‌ను రామ్‌కీ డెవలప్ చేయనుంది. పార్క్‌ను డెవలప్ చేయడానికి రూ.3 వేల కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది.
ఒప్పందం ప్రకారం, 95 ఏళ్ల కన్సెషన్ కాలంలో 5 ఏళ్లు నిర్మాణం కోసం, 90 ఏళ్లు ఆపరేషన్ కోసం కేటాయించారు. ఈ పార్క్‌ను వెయ్యి హెక్టార్ల విస్తీర్ణంలో రాయ్‌గఢ్ జిల్లాలోని మంగావన్, రోహా తాలూకాల్లో అభివృద్ధి చేస్తారు. ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ కంపెనీలకు రెంట్‌కి లేదా లీజుకి ఇస్తారు. రెంట్‌ల ద్వారా రామ్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి రెవెన్యూ వస్తుంది.
