ప్రభుత్వానికి రిజైన్ లేఖ
మధుసూదన్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ సర్కారు ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: రోడ్డు, భవనాల శాఖ ఈఎన్సీ గణపతి రెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తన రిజైన్ లెటర్‌ను ఆమోదించాలని కోరుతూ ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్‌కు ఆయన లేఖ రాశారు. 2017లోనే సీఈగా గణపతి రెడ్డి రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి ఆర్ అండ్ బీ ఈఎన్సీ (నేషనల్ హైవే)గా పని చేస్తున్నారు. గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎక్స్టెన్షన్లో ఉన్న తమను రిలీవ్ చేయాలని కోరుతూ గణపతి రెడ్డితో పాటు మరో ఈఎన్సీ రవీందర్ రావు ప్రభుత్వానికి లేఖ రాశారు. రవీందర్ రావును రిలీవ్ చేసిన ప్రభుత్వం.. గణపతి రెడ్డి హోల్డ్‌లో పెట్టింది. కాగా, గత నెల 24 నుంచి 31 వరకు గణపతి రెడ్డి సెలవులో ఉన్నారు. ఆయన లీవ్‌లో ఉండగానే.. ఆర్ అండ్ బీ ఈఎన్సీగా ఉన్న మధుసూదన్ రెడ్డికి గణపతి రెడ్డి నిర్వహిస్తున్న బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
పలు నిర్మాణాల్లో కీలక పాత్ర
తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి రాష్ట్రంలో జరిగిన అన్ని నిర్మాణాల్లో గణపతి రెడ్డి కీలక పాత్ర పోషించారు. కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గణపతి రెడ్డి మెదక్ జిల్లాలో చాలా కాలం పనిచేశారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక ఈఎన్సీగా నియమితులయ్యాడు. అప్పటి నుంచి హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లు, జిల్లా కలెక్టరేట్లు, ప్రగతిభవన్, సెక్రటేరియెట్, అమరవీరుల స్తూపం, బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్, అంబేద్కర్ విగ్రహం, రాజ్ భవన్ ఉద్యోగుల అపార్ట్మెంట్లు అన్నీ గణపతి రెడ్డి హయాంలోనే నిర్మించారు. ఎర్రమంజిల్ లో నిమ్స్ బిల్డింగ్, వరంగల్ హాస్పిటల్, హైదరాబాద్ లో మూడు టిమ్స్ నిర్మాణాల్లో కీలక పాత్ర పోషించారు. కాగా, అంచనా వ్యయాలు పెంచడంపై గణపతి రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
అంచనా వ్యయాల పెంపుపై విజిలెన్స్ విచారణ
వరంగల్ మల్టీ స్పెషాలిటీ, హైదరాబాద్‌లో నిర్మా ణంలో 3 టిమ్స్ హాస్పిటల్స్‌పై గత నెల 27న సీఎం రేవంత్ రివ్యూ నిర్వహించారు. ఈ ప్రాజెక్టులకు ముందు అనుకున్న దాని కంటే అంచనా వ్యయాలు భారీగా పెంచినట్లు సీఎం గుర్తించారు. వరంగల్ హాస్పిటల్‌కు 24 ఫ్లోర్స్‌కు ముందుగా వెయ్యి కోట్లు అనుకొని.. తర్వాత దాన్ని రూ.1,726 కోట్లకు పెంచారు. 3 టిమ్స్‌లకు రూ.2,679 కోట్లు అనుకొని.. దాన్ని రూ.3,562 కోట్లకు పెంచారు. ఈ 2 ప్రాజెక్టులు కలిపి రూ.1,509 కోట్లకు పెంచారని సీఎంకు అధికారులు తెలిపారు. దీంతో వీటిపై సమ గ్ర విచారణ జరిపించాలని విజిలెన్స్ అధికారులను సీఎం ఆదేశించారు. వీటి విషయంలో కూడా గణపతి రెడ్డి కీలకంగా వ్యవహరించారు. వరంగల్ వెళ్లి ఆఫీసర్లు విచారణ చేస్తున్నారు. కొత్త మెడికల్ కాలేజ్ లు, కలెక్టరేట్ ల నిర్మాణంలో కూడా భారీగా అంచనాలు పెంచినట్లు అధికారులు సీఎంకి తెలిపారు.