మండలి భవన పనులు త్వరగా పూర్తి చేయండి : ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ 

మండలి భవన పనులు త్వరగా పూర్తి చేయండి : ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర శాసన మండలి  భవన ఫినిషింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ సూచించారు. ఈ నెల 8న పునరుద్ధరించిన కౌన్సిల్ భవనాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో గురువారం ఆయన తుదిదశ పనులను పరిశీలించారు.  కొన్ని ప్రాంతాల్లో మిగిలిన పనులను పూర్తి చేయాలని ఇంజినీర్లు, వర్క్​ఏజెన్సీకి సూచించారు.

భవనంలో ఏర్పాటు చేస్తున్న ఫర్నీచర్, సభ్యుల కుర్చీలు, చైర్మన్ పోడియం, మైక్ సిస్టమ్, ఆడియో, -వీడియో సదుపాయాల పనులను నాణ్యతతో పూర్తి చేయాలని తెలిపారు. హెరిటేజ్ భవనాన్ని సంరక్షించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ భవనాన్ని పునరుద్ధరించిందని వికాస్ రాజ్ చెప్పారు.

ఇప్పటివరకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేశాయని, ఈ నెల 8న భవన ప్రారంభోత్సవం ఉండటంతో మిగిలిన పనులను సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. అసెంబ్లీ ఆవరణలో నిర్మిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాట్లను స్పెషల్ సీఎస్ పరిశీలించి పలు సూచనలు చేశారు. స్పెషల్ సీఎస్ వెంట ఆర్ అండ్ బీ శాఖ సీఈలు రాజేశ్వర్ రెడ్డి, నర్సింగ రావు, ఎస్‌‌‌‌ఈలు, ఈఈలు, ఏఈలు, కౌన్సిల్ సెక్రటరీ నర్సింహాచార్యులు తదితరులు ఉన్నారు.