ఎల్బీనగర్, వెలుగు : బాలుడిపై లైంగిక దాడి కేసులో నిందితుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు గురువారం పదేండ్ల జైలు శిక్షతోపాటు రూ.16 వేల జరిమానా విధించింది. ఫలక్ నుమాలోని వట్టేపల్లికి చెందిన మహమ్మద్ అబ్దుల్ మజీద్ (23) సరూర్ నగర్లోని గురుకుల పాఠశాలలో హౌస్ కీపర్గా పని చేస్తున్నాడు. అందులో చదువుతున్న బాలుడిపై 2018లో
లైంగికదాడికి పాల్పడగా, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. కేసును పోలీసులు దర్యాప్తు చేసి, పూర్తి సాక్ష్యాధారాలను కోర్టుకు అందజేశారు. ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్‌కోర్టు కేసును విచారించి, మజీద్ను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించింది. బాధితుడికి కోర్టు ద్వారా రూ.5 లక్షల పరిహారం అందజేశారు.
- ప్రేమ పేరుతో బాలికను వేధించిన టీచర్కు ఐదేండ్ల జైలు
మల్కాజిగిరి : స్కూల్లో ప్రేమ పేరుతో బాలికను వేధించిన టీచర్కు ఐదేండ్ల జైలు శిక్ష పడింది. మల్కాజిగిరికి చెందిన ఉరతల వెంకటరమణ అలియాస్ పులి (29) మౌలాలీలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 2016లో టీచర్‌గా పని చేశాడు. అదే స్కూల్లో ఓ మైనర్ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై మల్కాజిగిరి పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు.
మల్కాజిగిరి ఫాస్ట్ ట్రాక్ కోర్టు సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితుడికి గురువారం ఐదేండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది. బాధితురాలికి కోర్డు ద్వారా రూ.25 వేల నష్ట పరిహారాన్ని అందించారు.