రేషన్‌‌ డీలర్లు పోటీ చేయొచ్చు..అంగన్వాడీలకు నో చాన్స్‌‌..

రేషన్‌‌ డీలర్లు పోటీ చేయొచ్చు..అంగన్వాడీలకు నో చాన్స్‌‌..

ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులు గ్రామ సేవకులు, అంగన్వాడీలకు నో చాన్స్‌‌ అభ్యర్థుల అర్హతలు, అనర్హతలు, నామినేషన్, డిపాజిట్, వ్యయ పరిమితులపై ఈసీ గైడ్‌‌లైన్స్​ 

హైదరాబాద్, వెలుగు: స్థానిక ఎన్నికల్లో రేషన్​డీలర్లు పోటీ చేయొచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. నామినేషన్లు పరిశీలన తేదీ నాటికి 21 ఏండ్లు నిండి ఉన్నవారు అర్హులని. పోటీచేసే గ్రామం, ప్రాదేశిక నియోజకవర్గంలో ఓటు కలిగి ఉండాలని తెలిపింది. కాగా, ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులని పేర్కొన్నది. 

స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల  అర్హతలు, అనర్హతలు, నామినేషన్, డిపాజిట్, వ్యయ పరిమితులపై రాష్ట్ర ఎన్నికల సంఘం గైడ్‌‌లైన్స్​ విడుదల చేసింది. అభ్యర్థుల వ్యయ పరిమితిపై కొన్ని ఆంక్షలు విధించింది. తెలంగాణ పంచాయతీరాజ్‌‌ చట్టం-–2018 ప్రకారం అభ్యర్థులు వ్యయ పరిమితి విషయంలో ఉల్లంఘనలకు పాల్పడితే.. మూడేండ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అవుతారు. 

గెలిచినా పదవిని కోల్పోయే చాన్స్​ఉన్నది. 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో  సర్పంచ్ అభ్యర్థి రూ.2.5 లక్షలు (జనరల్​), రూ.1.5 లక్షలు (ఎస్సీ, ఎస్టీ),  వార్డు సభ్యుడు రూ.50 వేలు (జనరల్​), రూ.30 వేలు (ఎస్సీ, ఎస్టీ) మాత్రమే ఖర్చు చేయాలి. ఎన్నిక ల వ్యయాల కోసం తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా వివ రాలను అందించాలి. 

అభ్యర్థుల తరఫున రాజకీయ పక్షాలు చేసే ఖర్చులు కూడా క్యాండిడేట్‌‌ ఖాతాలోకే జమ అవుతాయి. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తేదీ నుంచి 45 రోజులలోపు ఖర్చుల తుది నివేదికను సంబంధిత అధికారికి సమర్పించాలి. అభ్యర్థులు నామినేషన్ పత్రాలతోపాటు  తమ అర్హతలు, అనర్హ తలు, క్రిమినల్ చరిత్ర, ఆస్తులు, అప్పులు,  విద్యా వివరాలపై సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ తప్పనిసరిగా దాఖలు చేయాలి. ఇందులో ఏది లేకపోయినా నామినేషన్ తిరస్కరిస్తారు. అఫిడవిట్‌‌లో తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.

గ్రామ సేవకులు, అంగన్వాడీలకు నో చాన్స్‌‌

 గ్రామ సేవకులు, అంగన్వాడీ కార్యకర్తలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎయిడెడ్ సంస్థలు, స్థానిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పోటీకి అనర్హులని ఎన్నికల సంఘం తెలిపింది.

సర్పంచ్ జీతం రూ.6,500  

రాష్ట్రంలో వార్డు మెంబర్లు, సర్పంచ్‌‌లు, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు 2021లో పెంచిన జీతాలే కొనసాగుతున్నాయి.  సర్పంచ్‌‌కు 2021 ముందు రూ.5 వేల జీతం ఉండగా.. ప్రస్తుతం రూ. 6,500,  ఎంపీటీసీలకు రూ. 6,500, జడ్పీటీసీలకు రూ.13వేలు, ఎంపీపీలకు రూ.13వేలు, జడ్పీ చైర్మన్ల రూ.లక్ష వరకు చెల్లిస్తున్నారు.