రేషన్ బియ్యం రాకెట్ గుట్టురట్టు

రేషన్ బియ్యం రాకెట్ గుట్టురట్టు
  • కాంట్రాక్టర్​, 8 మంది డీలర్లు, సిబ్బంది సహా 15 మంది అరెస్ట్​
  • రూ.17.22 లక్షల విలువైన 300 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం

హైదరాబాద్, వెలుగు: రేషన్  బియ్యం రాకెట్  గుట్టును అధికారులు రట్టు చేశారు. లారీకి ఉండాల్సిన జీపీఎస్​ను బైక్​కు అమర్చి రేషన్​ షాపులకు సరఫరా చేయాల్సిన బియ్యాన్ని బ్లాక్​ మార్కెట్​కు తరలిస్తున్న భారీ రాకెట్​ను సవిల్​ సప్లయ్స్,​ విజిలెన్స్, ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు ఛేదించారు. కాంట్రాక్టర్, 8 మంది డీలర్లు సహా 15 మందిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.17,22,600 విలువైన 300 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల్  లెవెల్  స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రేషన్​ బియ్యాన్ని డైవర్ట్  చేస్తున్నట్లు గుర్తించారు. సివిల్​ సప్లయ్స్​ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 2న సాయంత్రం 4:15 గంటలకు విశ్వసనీయ  సమాచారం ఆధారంగా విజిలెన్స్  టాస్క్ ఫోర్స్  అధికారులు ఒక బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అడ్డుకున్నారు. ఈ బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై ఫేక్ ట్రక్ షీట్లు ఉన్నాయి. లారీకి అమర్చాల్సిన జీపీఎస్  ట్రాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మార్చి వాహన కదలికలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లు గుర్తించారు. ఈ ట్రక్​ షీట్లలో ఉన్న వివరాల ప్రకారం లారీని  ట్రేస్​ చేసి నకిరిపేట సమీపంలో అడ్డుకున్నారు. 

అందులోని 600 బస్తాలు (300 క్వింటాళ్లు) పీడీఎస్  బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్​ షాపుల్లో బియ్యం నిల్వలు అధికంగా ఉండడంతో కొత్తగా వస్తున్న లారీ లోడ్ తో వచ్చే బియ్యాన్ని పక్కదారి పట్టించేందుకు స్టేజ్-1 కాంట్రాక్టర్​తో కొందరు డీలర్లు, అధికారులు కుమ్మక్కైనట్లు గుర్తించారు. ప్రధాన నిందితులుగా స్టేజ్-1 కాంట్రాక్టర్ ఎన్. శ్రీనివాస్, అతని సహాయకుడు ప్రశాంత్, లారీ డ్రైవర్  అనిల్ కుమార్, ఎంఎల్ఎస్  పాయింట్  ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి జరుపుల సత్యవతి, డేటా ఎంట్రీ ఆపరేటర్  బానోత్  కృష్ణకుమార్ మరో 8 మంది రేషన్​ డీలర్లతో సహా  మొత్తం 15 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. ఎంఎల్ఎస్  పాయింట్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జికి రూ.20 వేలు, డేటా ఎంట్రీ ఆపరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.10 వేలు, మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైకిల్  డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.10 వేలు లంచంగా ఇచ్చినట్టు గుర్తించారు.