- ప్రముఖ కవి, రచయిత కాలువ మల్లయ్య
కరీంనగర్, వెలుగు: హేతువాది, శతాధిక గ్రంథ రచయిత మలయశ్రీ మరణం హేతువాద భావజాల ప్రచారోద్యమానికి తీరని లోటని ప్రముఖ కథ, నవలా రచయిత కాలువ మల్లయ్య పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా సామాజిక చైతన్యంతో శ్రమించాలని సూచించారు. భౌతికవాది పత్రిక ఎడిటర్, సాహితీవేత్త, శతాధిక గ్రంథకర్త డాక్టర్ మలయశ్రీ సంస్మరణ సభ ఐఎంఏ హాల్ లో ఆదివారం భారత నాస్తిక సమాజం ఆధ్వర్యంలో నిర్వహించారు.
నాస్తిక సమాజం అధ్యక్షుడు జీడి సారయ్య అధ్యక్షతన నిర్వహించిన సభకు ముఖ్యఅతిథిగా కాలువ మల్లయ్య హాజరై మాట్లాడుతూ తాను స్వయంగా మలయశ్రీ శిష్యుడైనప్పటికీ హేతువాదరంగంలో ఆయన అంతటి గొప్పవాడిని కానని తెలిపారు. ఆయన ప్రభావంతోనే తాను ప్రసిద్ధమైన రచయితగా ఎదిగానని గుర్తు చేశారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శనిగరం తిరుపతయ్య మాట్లాడుతూ ప్రాచీన కాలానికి, ఇప్పటికీ పేదల జీవన విధానం చాలా మారిందని, కానీ, బానిసత్వం మారలేదన్నారు. అది కొత్త పద్ధతిలో కొనసాగుతోందని తెలిపారు.
సమాజంలో అడుగడుగున ఉన్న మూఢవిశ్వాసాలను, అహేతుక సిద్ధాంతాలను రూపుమాపేందుకు మలయశ్రీ జీవితాంతం శ్రమించాడని కొనియాడారు. ఆయన భావజాలాన్ని నేటి తరం అవగాహన చేసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మానవ వికాస వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రొంటాల బుచ్చయ్య, బీఎస్పీ జోన్ ఇన్ చార్జి నిషాని రామచంద్రం, విరసం జిల్లా కన్వీనర్ బాలసాని రాజయ్య, భానాస రాష్ట్ర నాయకులు వడకాపురం చంద్రమౌళి, మద్దెల లక్ష్మణ్, కొమ్ము రమేశ్, డీటీఎఫ్ నాయకులు ఎ.తిరుపతి పాల్గొన్నారు.

