అగ్నిపథ్ కింద.. 21 ఏళ్లకే సైన్యంలో చేరిన హీరో కుమార్తె

అగ్నిపథ్ కింద.. 21 ఏళ్లకే సైన్యంలో చేరిన హీరో కుమార్తె

ప్రముఖ నటుడి కుమార్తె సైన్యంలో చేరింది. భోజ్‌పురి నటుడు, తెలుగులో పలు సినిమాల్లో విలన్గా  నటించిన  బీజేపీ ఎంపీ రవి కిషన్ కుమార్తె ఇషితా శుక్లా డిఫెన్స్ ఫోర్స్‌లో జాయిన్ అయింది. అగ్నిపథ్ పథకం కింద ఇషిత సైన్యంలో చేరినట్లు రవికిషన్ వెల్లడించాడు. ఢిల్లీ డైరెక్టరేట్ కు చెందిన 7వ బెటాలియన్ లో ఇషితా శుక్లా సభ్యురాలని తెలిపారు. ప్రస్తుతం ఇషిత శుక్లా వయస్సు 21 సంవత్సరాలు మాత్రమే. 

కేంద్ర ప్రభుత్వం 2022లో  అగ్నిపథ్ పథకాన్ని ప్రారంభించింది.  ఎన్‌సీసీ క్యాడెట్ అయిన తన కూతురు ఇషిత శుక్లా సైన్యంలో చేరాలనుకుంటుందని 2023లో జనవరిలో రవి కిషన్ వెల్లడించారు. అంతేకాదు  జనవరిలో ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో తన కూతురు పాల్గొందని....ఢిల్లీ డైరెక్టరేట్‌లోని 7 గర్ల్స్ బెటాలియన్ క్యాడెట్‌లలో తన కూతురు ఉందని అప్పట్లో రవి కిషన్ సోషల్ మీడియాలో తెలిపారు.

చలిలో కష్టపడుతోంది..

"నా కుమార్తె ఇషితా శుక్లా గత 3 సంవత్సరాలుగా మన దేశానికి సేవ చేయడానికి చాలా కష్టపడుతోంది. ఆమె ఢిల్లీ డైరెక్టరేట్‌లోని 7 గర్ల్స్ బెటాలియన్‌కి చెందిన క్యాడెట్,  చలిలో కఠిన శిక్షణ పొందుతోంది. గణతంత్ర దినోత్సవ పరేడ్ లో పాల్గొనేందుకు  పొగమంచులో కర్తవ్య మార్గంలో కవాతు చేస్తోంది....అని రవి కిషన్ ట్విట్టర్ లో తెలిపారు. 

రవికిషన్ పై ప్రశంసలు..

ఇషిత శుక్లా భిన్నమైన రంగాన్ని ఎంచుకోవడంపై ఆమెను పలువురు అభినందిస్తున్నారు. ఇషిత యువతకు స్ఫూర్తి అంటూ  ఎంపీ రవికిషన్ సహచరులు ప్రశంసించారు.  సినిమా పరిశ్రమకు చెందిన నటీనటుల పిల్లల్లో కొందరైనా భిన్నమైన రంగాన్ని ఎంచుకుంటున్నందుకు సంతోషంగా ఉందని మరికొందరు అన్నారు. 

మూడున్నరేళ్ల పాటు సేవ..

ఢిల్లీలో జరిగిన 2023 రిపబ్లిక్ పరేడ్‌లో 147 మంది అమ్మాయిలతో కలిసి ఇషిత శుక్లా పాల్గొన్నారు. ఎన్‌సీసీ ఆర్మీ క్యాడెట్ అయిన ఇషిత వయసు 21 ఏళ్లు. ఆమెకు 2022లో ఎన్‌సీసీ ఏడీజీ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ లభించింది. కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చేతుల మీదుగా ఈ  బెస్ట్ క్యాడెట్ అవార్డును ఇషిత అందుకున్నారు. ఇప్పుడు అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్‌గా ఆర్మీలో చేరారు. ఆమె నాలుగేళ్ల పాటు ఆర్మీలో ఉండనున్నారు. ఇందులో ఆరు నెలల శిక్షణ ఉంటుంది. ఆ తరవాత మూడున్నరేళ్ల పాటు దేశానికి సేవ చేస్తారు. 

అగ్నిపథ్ అంటే..

సైన్యంలో నియామకాలకు కేంద్ర ప్రభుత్వం 2022లో అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చింది. 2023 జూలై నాటికి అగ్నిప‌థ్ పథకం కింద దేశంలోని 45 వేల మంది యువతను సైన్యంలోకి తీసుకోనున్నారు. 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వ‌య‌సు  వారినే అగ్నివీర్‌లుగా నియమిస్తారు. ఈ పథకంలో భాగంగా నాలుగేళ్ల పాటు యువ‌త‌ను భార‌త త్రివిధ ద‌ళాల్లో చేర్చుకుంటారు. అగ్నివీర్‌లుగా ఎంపికైన వారికి 10 వారాల నుంచి 6 నెలల వరకు శిక్షణ ఉంటుంది. నాలుగేళ్ల త‌ర్వాత కేవ‌లం 25 శాతం మంది సైనికులను మాత్రమే ఆర్మీలోకి రెగ్యుల‌ర్ క్యాడ‌ర్‌గా తీసుకుంటారు. వాళ్లు మాత్రమే 15 ఏళ్లపాటు స‌ర్వీస్‌లో ఉంటారు. మిగతా వాళ్లకు రూ.12 ల‌క్షలు ఇచ్చి ఇంటికి పంపిస్తారు. వాళ్లకు పెన్షన్ బెనిఫిట్ ఉండ‌దు.