
న్యూఢిల్లీ: బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టేందుకు ఇటీవల టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగిన విరాట్ కోహ్లీ.. వన్డే, టెస్ట్ బాధ్యతలు వదులుకున్నా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. టీ20 వరల్డ్‌కప్‌తో కోచ్‌గా రవి శాస్త్రి పదవీకాలం ముగియగా, కోహ్లీ టీ20 ఫార్మాట్ కెప్టెన్‌గా తప్పుకున్నాడు. శుక్రవారం జరిగిన ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ నిర్ణయంపై రవి శాస్త్రి మాట్లాడాడు. ‘ కోహ్లీ కెప్టెన్సీలోని ఇండియా టీమ్ టెస్టుల్లో ఐదేళ్లుగా టాప్ పొజిషన్‌లో ఉంది. మానసికంగా అలసిపోతేనో లేదంటే తన బ్యాటింగ్‌పై మరింత ఫోకస్ పెట్టాలని అనుకున్నప్పుడు ఫ్యూచర్‌లో తను టెస్ట్ కెప్టెన్సీ కూడా వదులుకుంటాడు. గతంలోనూ చాలామంది సక్సెస్‌ఫుల్ ప్లేయర్లు జట్టుకు ఉపయోగపడేలా బ్యాటింగ్ చేసేందుకు కెప్టెన్సీని వదులుకున్నారు. విరాట్‌లో ఇప్పటికీ ఆడాలనే కసి ఉంది. పైగా జట్టులో అందరికంటే ఫిట్‌గా ఉన్నాడు. కెప్టెన్‌గా కొనసాగాలా వద్దా అనేది విరాట్ ఇష్టం. కానీ టెస్టుల్లో మాత్రం కెప్టెన్‌గా కొనసాగితే మంచిది. ఎందుకంటే ఈ ఫార్మాట్‌కు కోహ్లీ కంటే గొప్ప అంబాసిడర్ మరొకరు లేరు’ అని శాస్త్రి చెప్పుకొచ్చాడు.