డబ్ల్యూటీసీ ఫైనల్లో  భరత్‌‌కే చాన్స్‌‌ ఇవ్వాలి: రవిశాస్త్రి

డబ్ల్యూటీసీ ఫైనల్లో  భరత్‌‌కే చాన్స్‌‌ ఇవ్వాలి: రవిశాస్త్రి

దుబాయ్‌‌:  డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా వికెట్‌‌ కీపర్‌‌గా కేఎస్‌‌ భరత్‌‌కే ఎక్కువ చాన్స్‌‌ ఉందని మాజీ చీఫ్‌‌ కోచ్‌‌ రవిశాస్త్రి అన్నాడు. అతన్ని తీసుకోవడమే సరైన ఎంపిక అని చెప్పాడు. రిషబ్‌‌ పంత్‌‌, కేఎల్‌‌ రాహుల్‌‌ ఈ మ్యాచ్‌‌కు అందుబాటులో లేకపోవడంతో భరత్‌‌తో పాటు ఇషాన్‌‌ కిషన్‌‌ను తుది జట్టులో చేర్చారు. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్లో ఎవర్ని ఆడించాలన్న  దానిపై మేనేజ్‌‌మెంట్‌‌ సందిగ్ధంలో పడింది. అయితే ఇషాన్‌‌ కిషన్‌‌ ఇంకా నిరూపించుకోవాల్సింది చాలా ఉందని, బోర్డర్‌‌–గావస్కర్‌‌ ట్రోఫీలో రాణించిన భరత్‌‌కే ఇప్పుడు చాన్స్​ ఇవ్వాలని శాస్త్రి అభిప్రాయపడ్డాడు.

‘ఇషాన్‌‌, భరత్‌‌లో బెటర్‌‌ వికెట్‌‌ కీపర్‌‌ ఎవరు అనేది చూడాలి. ఆసీస్‌‌పై భరత్‌‌ ఆకట్టుకున్నాడు. అన్ని టెస్ట్‌‌లు ఆడాడు. కాబట్టి అతన్ని తీసుకోవడమే కరెక్ట్‌‌. ఇషాన్‌‌కు మరోసారి చాన్స్‌‌ ఇవ్వాలి. ఏ వికెట్‌‌ కీపర్‌‌ను తీసుకోవాలన్నది అక్కడి ప్లేయింగ్‌‌ కండీషన్సే నిర్ణయిస్తాయి. ఇద్దరు స్పిన్నర్లు ఉంటే మాత్రం కచ్చితంగా భరత్‌‌నే తీసుకోవాలి’ అని శాస్త్రి వ్యాఖ్యానించాడు. లాంగ్‌‌ ఫార్మాట్‌‌లో ఇండియా తరఫున భరత్‌‌ నాలుగు టెస్ట్‌‌లు ఆడితే, ఇషాన్‌‌ ఇంకా డెబ్యూ చేయాల్సి ఉంది.