టెస్టుల్లో చరిత్ర సృష్టించిన అశ్విన్..ఏకైక భారత బౌలర్..

టెస్టుల్లో చరిత్ర సృష్టించిన అశ్విన్..ఏకైక భారత బౌలర్..

భారత సీనియర్  స్పిన్నర్  రవిచంద్రన్ అశ్విన్ అరుదైన చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో తండ్రీ కొడుకులను ఔట్ చేసిన తొలి టీమిండియా బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆ జట్టు ఓపెనర్ తేజ్ నారయణ్ చంద్రపాల్‌(12)‌ను అశ్విన్  క్లీన్ బౌల్డ్ చేసి..ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. 2011 వెస్టిండీస్ పర్యటనలో తేజ్‌ నారయణ్ తండ్రి, మాజీ క్రికెటర్ శివనారయణ్ చంద్రపాల్‌ను కూడా అశ్విన్ ఔట్ చేశాడు.  క్రికెట్ చరిత్రలో భారత్ తరఫున ఇలాంటి ఫిట్ ను ఏ  బౌలర్ అందుకోలేదు. 

టెస్టుల్లో తండ్రీ కొడుకులను ఔట్ చేసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ నాలుగో వాడు. అతని కన్నా ముందు టెస్టుల్లో  ఇయాన్ బోథమ్, వసీం అక్రమ్, మిచెల్ స్టార్క్ ఈ ఫీట్ సాధించారు. ఇయాన్ బోథమ్ ల్యాన్స్ కైర్న్స్, క్రిస్ కైర్న్స్ లను ఔట్ చేశాడు.  వసీం అక్రమ్ కూడా ఈ ఇద్దర్నీ పెవీలియన్ చేర్చాడు. అటు మిచెల్ స్టార్క్ శివ్ చంద్రపాల్, తేజ్‌నరైన్ చంద్రపాల్‌లను ఔట్ చేశాడు. ః

తేజ్ నారయణ్ చందర్ పాల్ వికెట్ తో అశ్విన్ టెస్టుల్లో  మరో ఘనతను అందుకున్నాడు.  టెస్టుల్లో క్లీన్ బౌల్డ్ ద్వారా అత్యధిక వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. ఇప్పటి వరకు అశ్విన్ 95 క్లీన్ బౌల్డ్‌లు చేశాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే(94) రికార్డును బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో అశ్విన్, కుంబ్లే తర్వాత కపిల్ దేవ్(88), మహమ్మద్ షమీ(66)లు ఉన్నారు.