క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టడం ఒక్క రోజు ఆలస్యమైనా.. కొండంత జరిమానాతో పాటుగా క్రెడిట్ స్కోర్ పడిపోతుందనే భయం ఇకపై అవసరం లేదు. ఎందుకంటే కార్డ్ హోల్డర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ ఇష్యూయెన్స్ అండ్ కాండక్ట్ డైరెక్షన్స్-2026లో భాగంగా సరికొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఈ రూల్స్ టెన్షన్‌తో బిల్లులు కట్టే సామాన్య మధ్యతరగతి క్రెడిట్ కార్డ్ యూజర్లకు పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి.
ఆ మూడు రోజులు చాలా కీలకం..
కొత్తగా తీసుకొస్తున్న రూల్స్ ప్రకారం.. క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయాల్సిన Due Date ముగిసిన వెంటనే మీ అకౌంట్ Past Due లేదా డిఫాల్ట్‌గా పరిగణించడానికి వీల్లేదు. బిల్ చెల్లింపు డెడ్ లైన్ ముగిసిన తర్వాత అదనంగా 3 రోజుల సమయం లభించనుంది. ఈ 3 రోజుల విండో పీరియడ్ లోపు క్రెడిట్ కార్డ్ హోల్డర్లు పేమెంట్ పూర్తి చేస్తే.. బ్యాంకులు వారిపై లేట్ ఫీజులు వేయవు. అలాగే మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీసే విధంగా క్రెడిట్ బ్యూరోలకు రిపోర్ట్ చేయడం కూడా ఇకపై కుదరదు.
పెనాల్టీ లెక్కల్లో పారదర్శకత..
ఆర్బీఐ మరో భారీ మార్పును కూడా తీసుకొచ్చింది. గతంలో బిల్లులో ఒక్క రూపాయి తక్కువ ఉన్నా.. మొత్తం బిల్లు అమౌంట్‌పై పెనాల్టీ వేసేవి కార్డ్ ఇచ్చిన ఫైనాన్స్ కంపెనీలు. కానీ ఇప్పుడు ఆ పద్ధతికి చెక్ పడింది. ఇకపై కేవలం చెల్లించాల్సిన బ్యాలెన్స్ అమౌంట్.. అంతే మెుత్తం బిల్లులో ఎంతైతే చెల్లించకుండా మిగిలిందో దానిపై మాత్రమే జరిమానా వసూలు చేయాలి. దీనివల్ల కస్టమర్లపై పడే ఆర్థిక భారం భారీగా తగ్గుతుంది. అయితే వడ్డీ లెక్కలు మాత్రం అసలు గడువు తేదీ నుంచే మొదలవుతాయని గుర్తుంచుకోవాలి.
కొత్త రూల్స్ ఎప్పుడు అమలులోకి వస్తాయి?
ఈ మార్పులన్నీ బ్యాంకింగ్ వ్యవస్థలో యూనిఫైడ్ పద్ధతులను తీసుకురావడానికి ఉద్దేశించినవి. బ్యాంకులు తమ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్, డిక్లరేషన్లను మార్చుకోవడానికి వీలుగా ఏప్రిల్ 1, 2027 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. ఇది క్రెడిట్ క్రమశిక్షణను దెబ్బతీయకపోయినా, పొరపాటున బిల్లులు మర్చిపోయే వారికి మాత్రం ఒక రక్షణ కవచంలా పనిచేయనుంది. సో చివరి నిమిషంలో రావాల్సిన పేమెంట్స్ ఒకటి రెండు రోజులు ఆలస్యం వల్ల కార్డ్ బిల్లులు ఆలస్యాలతో సతమతమై ఇబ్బంది పడే మధ్యతరగతి ప్రజలకు ఈ 3 రోజుల అదనపు గడువు సౌకర్యం పెద్ద ఊరటను కలిగించనుంది.
