మొత్తం ఆర్సీబీ యాజమాన్యం వల్లే.. పోలీసులు ఏం దేవుళ్లు కాదు: తొక్కిసలాటపై క్యాట్ కీలక వ్యాఖ్యలు

మొత్తం ఆర్సీబీ యాజమాన్యం వల్లే.. పోలీసులు ఏం దేవుళ్లు కాదు: తొక్కిసలాటపై క్యాట్ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా బెంగుళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) కీలక వ్యాఖ్యలు చేసింది. తొక్కిసలాటకు ప్రధాన కారణం ఆర్సీబీ యాజమాన్యమేనని.. దీనికి వాళ్లే బాధ్యత వహించాలని పేర్కొంది. ఐపీఎల్ 18 విజేతగా ఆర్సీబీ నిలవడంతో 2025, జూన్ 4న బెంగుళూరులో విక్టరీ పరేడ్‎తో పాటు చినస్వామి స్టేడియంలో ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగి 11 మంది అభిమానులు మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు.

ALSO READ | Sourav Ganguly: ఇండియన్ క్రికెట్ గురించి ఆందోళన లేదు.. వారిద్దరూ ముందుకు తీసుకెళ్తారు: గంగూలీ

తొక్కిసలాటకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని కర్నాటక ప్రభుత్వం పలువురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. సస్సెన్షన్‎ను సవాల్ చేస్తూ ఓ పోలీస్ అధికారి క్యాట్‎ను ఆశ్రయించాడు. ర్యాలీ ఏర్పాట్లకు పోలీసులకు తగినంత సమయం ఇవ్వలేదని.. అందుకే తొక్కిసలాట జరిగిందని.. ఇందులో పోలీసుల తప్పేమి లేదని క్యాట్‏లో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‎ను మంగళవారం (జూలై 1) విచారించిన క్యాట్.. విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. 


జూన్ 4న బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడిన ఘటనకు ఆర్సీబీ యజమాన్యం ప్రాథమికంగా బాధ్యత వహించాలని పేర్కొంది. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా మూడు నుంచి ఐదు లక్షల మందిని సమీకరించడానికి ఆర్సీబీ  సోషల్ మీడియాలో పోస్ట్‎లు పెట్టిందని.. ఈ పోస్టుల వల్లే అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని చెప్పింది. చివరి నిమిషంలో విక్టరీ పరేడ్, సన్మాన కార్యక్రమం ప్రకటించడాన్ని క్యాట్ తప్పుబట్టింది. 

ముందస్తు అనుమతి లేకుండా ఆకస్మాత్తుగా ఆర్సీబీ సెలబ్రేషన్స్ ప్రకటించడం ఇబ్బంది కల్గించిందని పేర్కొంది. కేవలం 12 గంటల తక్కువ సమయంలో పోలీసులు అన్ని ఏర్పాట్లను చేస్తారని ఆశించలేమంది. పోలీసులు కూడా మనుషులేనని.. వాళ్లేమి దేవుళ్లు లేదా ఇంద్రజాలికులు కాదని పోలీసులను సమర్ధించింది. అల్లాదీన్ వంటి మాయా శక్తులు పోలీసులకు లేవని చురకలంటించింది. పోలీసులకు అవసరమైన సన్నాహాలు చేయడానికి తగినంత సమయం ఇవ్వలేదని.. ఇందులో పూర్తిగా పోలీసులు తప్పేమి లేదని ట్రిబ్యునల్ పేర్కొంది.