Sourav Ganguly: ఇండియన్ క్రికెట్ గురించి ఆందోళన లేదు.. వారిద్దరూ ముందుకు తీసుకెళ్తారు: గంగూలీ

Sourav Ganguly: ఇండియన్ క్రికెట్ గురించి ఆందోళన లేదు.. వారిద్దరూ ముందుకు తీసుకెళ్తారు: గంగూలీ

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టును ఓడించాలంటే ఏ జట్టుకైనా సవాలే. 9 నెలల వ్యవధిలో రెండు ఐసీసీ టైటిల్స్ గెలిచిన టీమిండియా భవిష్యత్తులో ప్రపంచ క్రికెట్ ను శాసించే స్థాయికి చేరుకుంది. బెంచ్ కూడా చాలా బలంగా కనిపిస్తుంది. రానున్న 10 సంవత్సరాలు భారత క్రికెట్ జట్టు సేఫ్ జోన్ లో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇదంతా పరిమిత ఓవర్ల క్రికెట్ లోనే. టెస్ట్ క్రికెట్ లో టీమిండియా పరిస్థితి ఏం బాగాలేదు. చివరి 9 టెస్టుల్లో ఒకటే గెలిచింది. రోహిత్, కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆందోళన ఎక్కువైంది.   

ఛాంపియన్స్ ట్రోఫీ  గెలిచి ఊపు మీదున్నప్పటికీ అంతకముందు ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ సిరీస్.. స్వదేశంలో న్యూజిలాండ్ పై క్లీన్ స్వీప్ కావడం ఆందోళన కలిగించే విషయాలు. ఈ రెండు సిరీస్ లలో బ్యాటర్ల వైఫల్యమే కారణం. ఈ సిరీస్ ఓటములతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ అవకాశాలను చేజార్చుకుంది. వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియాకు తిరుగులేకపోయినా రెడ్ బాల్ క్రికెట్ లో మాత్రం తడబడుతున్న మాట వాస్తవం. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత భవిష్యత్ పై హామీ ఇచ్చాడు. 

గంగూలీ మాట్లాడుతూ.." నేను భారత క్రికెట్ గురించి ఎప్పుడూ ఆందోళన చెందలేదు. భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఒకరు ఉంటారు. యశస్వి (జైస్వాల్) పై నాకు పూర్తి నమ్మకముంది. అతన్ని నేను అద్భుతమైన బ్యాటర్‌గా రేట్ చేస్తాను. అతను అన్ని ఫార్మాట్లలో ఆడాల్సిన వ్యక్తి. టీమిండియాలో జైశ్వాల్, గిల్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారు. అవకాశం ఇస్తే పరుగులు చేయడానికి   4-5 మంది ఆటగాళ్ళు రెడీగా ఉన్నారు". అని గంగూలీ అన్నారు. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో ఓడిపోయింది. ఎడ్జ్ బాస్టన్ లో బుధవారం (జూలై 2) రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.