ప్రొఫెసర్లు లేరు.. చదువులో క్వాలిటీ లేదు: కేయూ విద్యార్థుల ఆవేదన

ప్రొఫెసర్లు లేరు.. చదువులో క్వాలిటీ లేదు: కేయూ విద్యార్థుల ఆవేదన
  • హాస్టల్‌‌లో తిండి కూడా సరిగా పెట్టడం లేదు
  • వర్సిటీ ల్యాండ్ కబ్జా అవుతున్నా పట్టించుకుంటలేరు
  • ఎమ్మెల్సీ తీన్మార్‌‌ మల్లన్న ఎదుట కేయూ విద్యార్థుల ఆవేదన

హనుమకొండ, వెలుగు: ‘కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు లేరు, 471 మంది ఉండాల్సిన చోట 77 మంది మాత్రమే ఉన్నారు. ఎడ్యుకేషన్‌‌లో క్వాలిటీ లేదు, హాస్టల్‌‌లో తిండి కూడా సక్కగ పెట్టడం లేదు, వేలాది మంది చదువుకునే లైబ్రరీలో 200 మందికి కూడా కుర్చీలు లేవు’ అని కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శుక్రవారం హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ సెనెట్‌‌ హాల్‌‌లో స్టూడెంట్లు, ఔట్‌‌ సోర్సింగ్‌‌, కాంట్రాక్ట్, పార్ట్‌‌టైం లెక్చరర్లు, నాన్‌‌ టీచింగ్‌‌ సిబ్బందితో ఇంటరాక్షన్‌‌ ప్రోగ్రామ్‌‌ నిర్వహించారు. 

కార్యక్రమానికి రిజిస్ట్రార్ ప్రొఫెసర్‌‌ వి.రామచంద్రం హాజరుకాగా.. స్టూడెంట్లు, సిబ్బంది వివిధ సమస్యలను మల్లన్న దృష్టికి తీసుకొచ్చారు. కేయూ కామన్‌‌ మెస్‌‌లో అధికారులు కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని, విచారణ కమిటీ పేరున కాలయాపన తప్ప చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు చాలా దూరం నడిచి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి బస్‌‌ సౌకర్యం కల్పించాలని కోరారు.

వర్సిటీ భూములను ప్రైవేట్‌‌ వ్యక్తులు ఆక్రమించినా చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. క్యాంపస్‌‌ ఆవరణలో యంగ్‌‌ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతామంటేనే అడ్డుకున్నామని, ఇప్పుడు అదే భూమిని పోలీస్‌‌ శాఖకు అప్పగించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. కాంపౌండ్ వాల్‌‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసినా.. ఇంతవరకు పనులు మాత్రం మొదలుపెట్టలేదన్నారు. 

సమస్యలు చెప్పుకుందామని వీసీ దగ్గరికి వెళ్తే.. పోలీసులతో దౌర్జన్యం చేయిస్తున్నారని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించే లీడర్లు అయితేనే యూనివర్సిటీలోకి రావాలని, ఫొటోలకు ఫోజులు ఇచ్చి వెళ్దామనుకుంటే మాత్రం క్యాంపస్‌‌లో అడుగుపెట్టనియ్యబోమని స్పష్టం చేశారు. అనంతరం పలువురు పార్ట్‌‌టైం లెక్చరర్లు మాట్లాడుతూ రెగ్యులర్‌‌ ప్రొఫెసర్లతో సమానంగా పని చేస్తున్నా తమను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించేలా చూడాలని కోరారు. 

వర్సిటీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్త: తీన్మార్‌‌ మల్లన్న
యూనివర్సిటీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 12 వర్సిటీల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్‌‌ అందినప్పుడే వ్యవస్థ బాగుపడుతుందన్నారు. హెల్త్, ఎడ్యుకేషన్‌‌ సిస్టంను ప్రక్షాళన చేసి, బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. వర్సిటీలకు సంబంధించిన ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. స్కాలర్‌‌షిప్స్‌‌, ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌ తదితర అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని చెప్పారు.