అయిజ, వెలుగు: ఇందిరమ్మ ఇంటి బిల్లు మంజూరుకు లంచం డిమాండ్ చేసిన ఓ విలేజ్ సెక్రటరీని ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గద్వాల ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... గద్వాల జిల్లా అయిజ మండలంలోని ఎక్లాస్‌పూర్ గ్రామానికి చెందిన సరోజమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది. నాలుగు విడతల్లో వచ్చే బిల్లు మంజూరు అయ్యేలా చూసేందుకు రూ. 20 వేలు ఇవ్వాలని విలేజ్ సెక్రటరీ రంగన్న డిమాండ్ చేశారు. ఇటీవల లబ్ధిదారుల ఖాతాలో మొదటి విడత బిల్లు జమ అయింది.
దీంతో తనకు డబ్బులు ఇవ్వాలని సెక్రటరీ రంగన్న.. లబ్ధిదారురాలి భర్త ఉరుకుందును డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేమని ఉరుకుందు చెప్పడంతో రూ. 15 వేలకు సెక్రటరీ ఒప్పుకున్నాడు. దీంతో ఉరుకుందు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. వారి సూచనతో శుక్రవారం ఎంపీడీవో ఆఫీస్‌లో విలేజ్ సెక్రటరీ రంగన్నను కలిసి రూ. 15 వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు విలేజ్ సెక్రటరీ రంగన్నను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
