ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. మరో చోట అనుమానంతో భార్యను చంపిన భర్త

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. మరో చోట అనుమానంతో భార్యను చంపిన భర్త
  • భద్రాద్రి, ములుగు జిల్లాల్లో కలకలం రేపిన హత్యలు

చండ్రుగొండ, వెలుగు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. తర్వాత మంచం పైనుంచి పడి చనిపోయాడని అందరినీ నమ్మించి, అంత్యక్రియలు సైతం పూర్తి చేయించింది. కానీ మృతుడి కుటుంబసభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. 

ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని తిప్పనపల్లిలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన సయ్యద్‌‌ జాఫర్(33), ఖతీజా భార్యాభర్తలు. ఖతీజాకు ఇటీవల చింతలపూడి ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. 

ఈ క్రమంలో జాఫర్‌‌ను హత్య చేసేందుకు ఖతీజాతో పాటు ఆమె ప్రియుడు నిర్ణయించుకున్నారు. బుధవారం రాత్రి జాఫర్‌‌ పడుకున్న తర్వాత ప్రియుడితో కలిసి జాఫర్‌‌ ముఖంపై దిండుతో అదిమి హత్య చేసింది. తర్వాత మంచం మీది నుంచి పడి చనిపోయాడంటూ కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు గురువారం సాయంత్రం అంత్యక్రియలు పూర్తి చేశారు. 

కానీ ఖతీజా తన ప్రియుడితో ఫోన్‌‌లో మాట్లాడుతుండడం, భర్త చనిపోయిన బాధ కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన జాఫర్‌‌ కుటుంబ సభ్యులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఖతీజాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, జాఫర్‌‌ డెడ్‌‌బాడీని బయటకు తీసి పోస్ట్‌‌మార్టం నిర్వహిస్తామని ఎస్సై శివరామకృష్ణ తెలిపారు. 

ములుగు జిల్లాలో..
వెంకటాపూర్‌‌ (రామప్ప), వెలుగు : భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్‌‌ పీఎస్‌‌ పరిధిలోని పెద్దాపూర్‌‌ గ్రామంలో జరిగింది. ఎస్సై చల్ల రాజు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన గోదారి రాజసమ్మయ్య, సంధ్య(35) భార్యాభర్తలు.

భార్యపై అనుమానంతో రాజసమ్మయ్య నిత్యం గొడవ పడుతుండడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. బుధవారం పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ జరుగగా.. కలిసి ఉంటామని చెప్పి సంధ్యను ఇంటికి తీసుకొచ్చాడు. గురువారం రాత్రి ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరగడంతో ఆగ్రహానికి గురైన రాజసమ్మయ్య గొడ్డలితో సంధ్యపై దాడి చేయగా ఆమె అక్కడికక్కడే చనిపోయింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ కిశోర్‌‌కుమార్‌‌, సీఐ సురేశ్‌‌, ఎస్సై రాజు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.