RCB vs LSG: డికాక్, పూరన్‌ల విధ్వంసం.. సొంత ఇలాకాలో RCBకి రెండో ఓటమి

RCB vs LSG: డికాక్, పూరన్‌ల విధ్వంసం.. సొంత ఇలాకాలో RCBకి రెండో ఓటమి

మునపటి సీజన్ల ఆనవాయితీని బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టు ప్రస్తుత సీజన్‌లోనూ కొనసాగిస్తోంది. ఈ జట్టు ప్రదర్శన చూస్తుంటే.. టైటిల్ సంగతి దేవుడెరుగు, అసలు నాకౌట్‌కైనా చేరతారా..! అన్న అనుమానాలు అభిమానుల్లో కలుగుతున్నాయి. కనీసం సొంతగడ్డపైనా ఆర్‌సీబీ జట్టు విజయం సాధించలేకపోతోంది. చిన్నస్వామి స్టేడియంలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది.

క్వింటన్ డికాక్(81) విధ్వంసానికి పూరన్(40 నాటౌట్) మెరుపులు తోడవ్వడంతో లక్నో జట్టు.. బెంగళూరుపై అలవోకగా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 181 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో డుప్లెసిస్ సేన 153 పరుగులకే  కుప్పకూలింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీకి ఇది మూడో ఓటమి. అందునా సొంతగడ్డపై ఓటమి పాలవుతుండటం ఆ జట్టు అభిమానులను కలవరపెడుతోంది. 

182 ప‌రుగ‌లు ఛేద‌న‌లో ఆర్‌సీబీ ప‌వ‌ర్ ప్లే లోపే మూడు కీల‌క వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లీ(22), డూప్లెసిస్(19), మ్యాక్స్‌వెల్(0)లు పెవిలియ‌న్ చేరారు. ఆపై కొద్ది సేపటికే కామెరాన్ గ్రీన్(9) వారి వెంటే పెవిలియన్ చేరాడు. దీంతో మ్యాచ్ లక్నో చేతుల్లోకి వెళ్లిపోయింది. చివరలో మహిపాల్ లామ్రోర్(33; 13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) బౌండరీల మోత మోగిస్తూ అభిమానుల కళ్లలో కాసింత ఆనందాన్ని నింపాడు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్ మరోసారి తన పేస్‌తో ఔరా అనిపించాడు. తన 4  ఓవర్లలో 14 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

డికాక్ విధ్వంసం.. పూరన్ మెరుపులు

అంతకుముందు క్వింట‌న్ డికాక్ (81), నికోల‌స్ పూర‌న్(40 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో ల‌క్నో నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆర్‌సీబీ బౌల‌ర్లలో మ్యాక్స్‌వెల్ ఒక్కడే పర్వాలేదనిపించాడు. తన 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.