మళ్లీ పుంజుకుంటున్న రియల్ రంగం

మళ్లీ పుంజుకుంటున్న రియల్ రంగం

హైదరాబాద్: రియల్ ఎస్టేట్…ఇన్వేస్టర్లను తక్కువ సమయంలోనే కోటీశ్వరులను చేసిన రంగం. కరోనా ప్రభావం, లాక్ డౌన్ కారణంగా ఢీలాపడ్డ హైదరాబాద్ రియల్ రంగం మళ్లీ పుంజుకుంటోంది. దేశ వ్యాప్తంగా భూములు, ప్రాపర్టీల ధరలు పడిపోయిన సమయంలో…సిటీలో రియల్ ఎస్టేట్ కు అలాంటి ఇబ్బందులేమీ లేవంటున్నారు నిపుణులు. అనరాక్, నైట్ ఫ్రాంక్ లాంటి ప్రాపర్టీ సంస్థల రిపోర్ట్స్ ను తలకిందులు చేస్తూ…దూసుకెళ్తోంది రియల్ రంగం. సిటీలో రియల్ రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపించింది. అయితే తొందరగానే కోలుకొని ఇప్పుడిప్పుడే మళ్ళీ పుంజుకుంటోంది. అనరాక్, నైట్ ఫ్రాంక్ లాంటి సంస్థలు దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పడిపోయిందనీ… భూముల ధరలు తగ్గాయని ప్రకటించినా… గ్రౌండ్ లెవల్ లో అలాంటిదేమీ లేదంటున్నారు బిల్డర్లు, డెవలపర్లు.

నిజానికి కరోనాతో దేశమంతటా అమ్మకాలు, కొనుగోళ్లు తగ్గాయి. కానీ హైదరబాద్ మార్కెట్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉందంటున్నారు బిల్డర్లు. లాక్ డౌన్ టైమ్ లో ఎవరూ బయటికి రాకపోవడంతో అమ్మకాలు తగ్గాయనీ…. ఇప్పుడు ప్రాపర్టీల కోసం కస్టమర్లు క్యూ కడుతున్నట్టు చెబుతున్నారు. లోన్ లు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసిన ఒకరిద్దరు మినహా… ఏ ఒక్క రియల్ ఎస్టేట్ సంస్థ గానీ… బిల్డర్లు కానీ ధరలు తగ్గించలేదంటున్నారు. లాక్ డౌన్ తో తమపై భారం పెరిగిందంటున్నారు బిల్డర్లు. కరోనాకు ముందు 230 నుంచి  260 వరకు ఉన్న సిమెంట్ ధర…ప్రస్తుతం 360 పలుకుతోందంటున్నారు. డీజిల్, స్టీల్,  ఇసుక రేట్లు కూడా పెరిగాయని.. లేబర్ కొరతతో…ఉన్నవారికి డిమాండ్ పెరిగిందంటున్నారు. ధరలు పెరగడంతో బిల్డర్లపై భారం పడుతోందని అంటున్నారు.  సిటీలో ఎక్కడా ధరలు తగ్గకపోగా… తొందరలోనే ఓపెన్ ప్లాట్లతో పాటు రెసిడెన్షియల్ ప్లాట్ల ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు.

హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్త ఇళ్లు, ప్లాట్ల అమ్మకాలు 85 శాతం తగ్గుతాయని అనరాక్  కన్సల్టెన్సీ ప్రకటించింది. 2019-20 ఏడాది ఏప్రిల్ –జూన్… మూడు నెలల కాలంలో హైదరాబాద్  మార్కెట్లో 4 వేల 430 ఇళ్ళు అమ్ముడవగా 2020-21 మొదటి 3 నెలల్లో కొత్త ఇళ్లు, ఫ్లాట్ల అమ్మకాలు 660కి మించవని అంచనా వేసింది. అయితే అనరాక్ అంచనాలకి మించి…. ఓపెన్ ప్లాట్లతో పాటు ఇళ్లనీ కొనేందుకు హైదరాబాదీలు ఆసక్తి చూపిస్తున్నారన్నారంటున్నారు వ్యాపారులు. కరోనా మహమ్మారితో వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లడంతో నిర్మాణాలు ఆలస్యమయ్యాయనీ.. అయితే ప్రస్తుతం 60 నుంచి 80శాతం మంది తిరిగి వచ్చేశారంటున్నారు బిల్డర్లు. దీంతో లాక్ డౌన్ లో ఆగిన ప్రాజెక్టులు తిరిగి జోరందుకున్నాయని చెబుతున్నారు.